ఎప్పుడైతే అమెరికా సేనలు తప్పుకుంటున్నట్టు ప్రకటించాయో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం రోజున తాలిబన్లు కాబూల్ శివారు ప్రాంతానికి చేరుకోగా, సోమవారం నాడు కాబూల్‌లోకి వచ్చారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని, ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్‌లకు మంచిరోజులు వచ్చాయని అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. శాంతియుతమైన పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్ నేతలు, త్వరలోనే అధికారం మార్పిడి జరుగుతుందని, ఏ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకోబోనివ్వమని తెలిపారు. శాంతియుతమైన, అభివృద్ది పాలనను అందిస్తామని తాలిబన్ రాజకీయ కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, తాలిబన్ల పాలనపై ప్రజలకు నమ్మకం లేదు. 1994 నుంచి 2001 వరకు తాలిబన్ల పాలనలో ప్రజలు ఎంతటి నరకాన్ని అనుభవించారో వారింకా మర్చిపోలేదు. ఇప్పుడు కూడా అదేవిధమైన పాలన చూడాల్సి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు.
తాలిబన్ల కీలక ప్రకటన: యుద్ధం ముగిసింది… ఎవరినీ వాడుకోనివ్వం…
