NTV Telugu Site icon

Al Jazeera: కెమెరాలు తీసుకుని వెళ్లిపోండి.. ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్..

Al Jazeera

Al Jazeera

Al Jazeera: ఖతార్‌కి చెందిన ప్రముక మీడియా సంస్థ ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్ ఇచ్చింది. వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాలో అల్ జజీరా కార్యాలయానికి వెళ్లిన ఇజ్రాయిల్ ఆర్మీ వెంటనే వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. భారీగా ఆయుధాలు, ముసుగులు ధరించిన ఇజ్రాయిల్ సైనికులు ఆదివారం తెల్లవారుజామున మీడియా ఆఫీస్ ఉన్న భవనంలోకి వెళ్లారు. అనంతరం వెస్ట్ బ్యాంక్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమారీకి నోటీసులు అందించారు. 45 రోజుల పాటు అల్ జజీరా కార్యాలయాన్ని మూసివేయాలనే ఆర్డర్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య

అల్ జజీరాని 45 రోజుల పాటు మూసివేయడానికి కోర్టు తీర్పు ఉందని ఇజ్రాయిల్ సైనికులు పేర్కొన్నారు. ఈ క్షణమే అన్ని కెమెరాలు తీసుకుని ఆఫీసు నుంచి బయలుదేరాలని ఇజ్రాయిల్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో జెరూసలేంలో అజ్ జజీరా కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న ఓ హోటల్‌పై ఇజ్రాయిల్ అధికారులు దాడులు చేశారు.

అయితే, ఈ దాడుల్ని అల్ జజీరా ఖండించింది. ఇది మానవహక్కులు, సమాచార హక్కుని ఉల్లంఘించే చర్యగా పేర్కొంది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ చర్యల్ని దాచిపెట్టే ప్రయత్నంగా అభివర్ణించింది. ఇజ్రాయిల్ చర్య అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు విరుద్ధంగా ఉందని చెప్పింది. గత నెలలో గాజాలో వైమానిక దాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ ఇస్మాయిల్ అల్ ఘౌల్‌ని ఇజ్రాయిల్ చంపేసింది. అక్టోబర్ 07 దాడిలో ఇతను హమాస్ కార్యకర్తగా పాల్గొన్నట్లు చెప్పింది. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న అల్-ఘౌల్ ఎలైట్ నుఖ్బా యూనిట్‌లో సభ్యుడు , ఇజ్రాయిల్‌పై దాడుల్ని ఎలా రికార్డ్ చేయాలో హమాస్ కార్యకర్తలకు సూచించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.