World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?

World War 3

World War 3

China Vs Taiwan: ప్రపంచ పటంపై ఒక చిన్న చుక్కలా కనిపించే ద్వీపం తైవాన్(Taiwan). దీనికోసం అగ్రరాజ్యాలు అమెరికా, చైనా(China) తీవ్రంగా పోటీ పడుతున్నాయి. డెమొక్రసీకి, డిక్టేటర్‌షిప్‌కు మధ్య జరుగుతున్న ఈ మైండ్‌గేమ్‌ చాలా ఆసక్తికరంగా మారుతోంది. దశాబ్దాలుగా చైనా, తైవాన్‌ను తన సొంత ఆస్తిగా భావిస్తోంది. ఒకవేళ యుద్ధం వస్తే అది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చైనాలో పర్యటిస్తున్న వేళ తైవాన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని డ్రాగన్ అధినేత జిన్ పింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అసలు తైవాన్ విషయంలో చైనా ఎందుకంత పట్టుదలగా ఉంది.? ఈ అంతర్జాతీయ సంక్షోభం వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలు, ఆర్థిక ప్రయోజనాలు, భౌగోళిక అనివార్యతలు

ఏంటి?

వన్స్ చైనా పాలసీ అంటే?

చైనా – తైవాన్ మధ్య ఉన్న ఈ వైరం నిన్న మొన్నటిది కాదు. దీని పునాదులు 1949 నాటి చైనా అంతర్యుద్ధంలో ఉన్నాయి. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ చేతిలో ఓడిపోయిన.. చియాంగ్ కై-షేక్ నాయకత్వంలోని నేషనలిస్టులు.. ప్రాణభయంతో తైవాన్ ద్వీపానికి పారిపోయి.. అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి చైనా దీన్ని తన భూభాగం నుంచి విడిపోయిన ఒక తిరుగుబాటు ప్రాంతంగానే పరిగణిస్తోంది తప్ప, స్వతంత్ర దేశంగా గుర్తించడం లేదు. “Once China ” పాలసీ ద్వారా తైవాన్‌ను ఎప్పటికైనా తమలో విలీనం చేసుకోవాలని బీజింగ్ ప్రయత్నిస్తోంది. తైవాన్ మాత్రం తాము సార్వభౌమాధికారం కలిగిన దేశమని, ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉందని వాదిస్తోంది. ఈ భౌగోళిక వైరుధ్యమే ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. జిన్ పింగ్ తన హయాంలో ఈ విలీనాన్ని ఒక చారిత్రక లక్ష్యంగా పెట్టుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.

ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కీలకం:

తైవాన్ కేవలం ఒక ద్వీపం మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటిది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న అత్యంత అధునాతన సెమీకండక్టర్ చిప్స్‌లో దాదాపు 90 శాతం ఒక్క తైవాన్‌ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. తైవాన్‌లోని TSMC అంటే తైవాన్‌ సెమీకండక్టర్‌ మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీ(Taiwan Semiconductor Manufacturing Company).. ఇది ప్రపంచంలోనే సెమీ కండక్టర్లు ఉత్పత్తి చేస్తున్న అతి పెద్ద కంపెనీ. స్మార్ట్‌ఫోన్ల నుంచి సూపర్ కంప్యూటర్ల వరకు, ఎలక్ట్రిక్ వాహనాల నుండి అధునాతన యుద్ధ విమానాల వరకు ప్రతిదానికీ ఈ చిప్స్ చాలా కీలకం. చైనా ఈ సాంకేతికతపై పట్టు సాధిస్తే, ప్రపంచ మార్కెట్‌ను తన గుప్పిట్లోకి తీసుకోవచ్చని భావిస్తోంది. అదే సమయంలో అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల టెక్నాలజీ రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే, ఈ ఘర్షణ కేవలం భూభాగం కోసం జరుగుతున్నది కాదు, ఇది డిజిటల్ యుగంలో ఎవరు సర్వాధికారిగా ఉండాలనే అంశాన్ని తేల్చే ‘టెక్-వార్’. ఈ ఆర్థిక ప్రయోజనాలే తైవాన్ రక్షణ కోసం అమెరికాను ప్రాణాలకు తెగించేలా చేస్తున్నాయి.

ఫస్ట్ ఐలాండ్ చైన్ అంటే?

భౌగోళికంగా కూడా తైవాన్ ఎంతో కీలక ప్రాంతంలో ఉంది. అమెరికా రక్షణ వ్యూహంలో తైవాన్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో చైనాను అడ్డుకునేందుకు అమెరికా ఏర్పాటు చేసుకున్న ‘ఫస్ట్ ఐలాండ్ చైన్’లో తైవాన్ ఒక బలమైన కోట. జపాన్ నుంచి ఫిలిప్పీన్స్ వరకు విస్తరించి ఉన్న ఈ గొలుసులో తైవాన్ లేకపోతే, చైనా నౌకాదళానికి పసిఫిక్ సముద్రంలోకి నేరుగా ప్రవేశించే అవకాశం దక్కుతుంది. ఇది అమెరికాలోని హవాయ్ లేదా గువామ్ వంటి ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పుగా మారుతుంది. చైనాకు తన సరిహద్దుల్లో అమెరికా ప్రాబల్యం ఉండటం ఇష్టం లేదు, అందుకే తైవాన్ విషయంలో చైనా అంత కఠినంగా వ్యవహరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చెలాయించాలన్నా, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను నియంత్రించాలన్నా చైనాకు తైవాన్ అవసరం చాలా ఉంది. ఈ చెక్-అండ్-బ్యాలెన్స్ ఆటలో రెండు దేశాల మధ్య ఏ చిన్న పొరపాటు జరిగినా అది యుద్ధానికి దారితీస్తుంది.

చైనా తైవాన్‌ను ఆక్రమిస్తే ఏమౌతుంది?

తైవాన్ విషయంలో అమెరికా వ్యూహంపై కాస్త అస్పష్టత కనిపిస్తున్నా, లోపల మాత్రం బలమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. 1979 తైవాన్ సంబంధాల చట్టం ప్రకారం, తైవాన్‌కు ఆయుధాలను సరఫరా చేయాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది. ట్రంప్ తన పర్యటనలో ఏఐ, ఇంధన భద్రత గురించి చర్చిస్తూనే తైవాన్ అంశాన్ని లేవనెత్తడం చైనాకు మింగుడుపడటం లేదు. అమెరికాకు తైవాన్ ఒక ప్రజాస్వామ్య మిత్రదేశమే కాదు, చైనాను నిలువరించే సింహద్వారం. ఒకవేళ చైనా.. తైవాన్‌ను ఆక్రమిస్తే, ఆసియాలో అమెరికా విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అమెరికాను నమ్మడం మానేసే ప్రమాదం ఉంది. ఈ జియో పాలిటిక్స్ కోసం, తమ అగ్రరాజ్య హోదాను కాపాడుకోవడం కోసం అమెరికా అక్కడ తన సైనిక ఉనికిని పెంచుకుంటూనే ఉంది.

యుద్ధం తప్పదని చైనా వార్నింగ్:

తైవాన్ జోలికి రావద్దంటూ జిన్‌పింగ్ చేసిన హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కావు, అవి రాబోయే యుద్ధానికి ముందస్తు సూచనలుగా చెప్పుకోవచ్చు. “తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకుంటే ఘర్షణ కాకుండా యుద్ధం వస్తుంది” అన్న జిన్‌పింగ్ మాటల వెనుక.. బీజింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉందనే సంకేతం కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా చైనా తన యుద్ధ విమానాలను, నౌకలను తైవాన్ గగనతలంలోకి, జలాల్లోకి తరచుగా పంపిస్తూ సైకలాజికల్ వార్ చేస్తోంది. చైనా అంతర్గతంగా ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, జాతీయవాదాన్ని రగల్చడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి తైవాన్ విలీనం ఒక అస్త్రంగా ఉపయోగపడవచ్చు. డోనాల్డ్ ట్రంప్ వంటి దూకుడు స్వభావం ఉన్న నాయకుడితో డీల్ చేసేటప్పుడు, తన పట్టు కోల్పోకూడదని చైనా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఏవైనా తేడాలొస్తే అది కేవలం ఆసియా ఖండానికే కాదు, మొత్తం ప్రపంచ సరఫరా వ్యవస్థకు గొడ్డలిపెట్టు కానుంది.

AI యుద్ధాలు వస్తాయా?

అమెరికా – చైనా మధ్య ప్రస్తుత చర్చల్లోని ఏఐ అంశం కూడా తైవాన్ సంక్షోభంతో ముడిపడి ఉంది. భవిష్యత్తులో యుద్ధాలు మనుషుల కంటే ఎక్కువగా కృత్రిమ మేధస్సుతోనే నడుస్తాయి.
అటువంటి ఏఐ చిప్స్ తయారీలో తైవాన్ అగ్రగామిగా ఉండటం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ అమెరికా తన ఏఐ టెక్నాలజీని తైవాన్ రక్షణ వ్యవస్థలో పూర్తిగా అనుసంధానిస్తే, చైనా సైనిక శక్తికి అది పెను సవాలుగా మారుతుంది. అందుకే సాంకేతికపరమైన ఆంక్షలు, సుంకాల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చైనా వ్యూహాలను ప్రభావితం చేస్తాయి. ఇంధన భద్రత పేరుతో చైనా రష్యా నుండి చమురును పొందుతుండగా, అమెరికా తన మిత్రదేశాల ద్వారా చైనాను ఆర్థికంగా ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ లో తైవాన్ ఒక బలిపశువు కాకూడదని ప్రపంచం కోరుకుంటోంది.

తైవాన్ అంశం నేడు ఒక ప్రాంతీయ వివాదం స్థాయిని దాటి, ప్రపంచ వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకుంది. ఒకవైపు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలన్న తపన, మరోవైపు విస్తరణవాదంతో ఉర్రూతలూగుతున్న కమ్యూనిస్ట్ అహంకారం మధ్య ఈ యుద్ధం నడుస్తోంది. ట్రంప్ – జిన్ పింగ్ మధ్య జరుగుతున్న ఈ దౌత్యపరమైన యుద్ధం చివరకు శాంతికి దారితీస్తుందా లేక రణక్షేత్రానికి పునాది వేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

:- ఫణి కుమార్ (NTV DIGITAL)