Site icon NTV Telugu

Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు..

Sri Lanka

Sri Lanka

Sri Lanka: ద్వీప దేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఏకంగా 39 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ముగ్గురు మైనారిటీ తమిళులతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు పోటీ చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 21న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. 2019లో జరిగిన చివరి అధ్యక్ష ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 1982 అక్టోబర్‌లో జరిగిన తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు.

Read Also: Sheikh Hasina: షేక్ హసీనాపై ‘‘మారణహోమం’’ దర్యాప్తు ప్రారంభించిన బంగ్లాదేశ్ కోర్టు..

ద్వీప దేశంలోని 22 ఎన్నికల జిల్లాల్లో 17 మిలియన్ల మంది ఈ సారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కుటుంబ వారసుడు 38 ఏల్ల నమల్ రాజపక్సే, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నాయకుడు అనుర కుమార దిసనాయకే ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన అభ్యర్థులు. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత 2022లో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఏకంగా అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశాన్ని విడిచి పారిపోయాడు. ఆ తర్వాత పరిణామాల్లో రణిల్ విక్రమ‌సింఘే అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టారు. ఈ ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి.

Exit mobile version