అమెరికాకు చెందిన స్పేస్ X సంస్థ అంతరిక్ష యాత్రలో మరో ఘనత సాధించింది. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోకి స్పేస్ X సంస్థ నలుగురు వ్యోమగాములను పంపింది. వీరు 10రోజుల పాటు ఆ కేంద్రంలో గడపనున్నారు. ఐఎస్ఎస్‌కు పయనమైన మొట్టమొదటి ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ ఇదే. దిగువ భూ కక్ష్యలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. అయితే స్పేస్ X సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందినది కావడం విశేషం.
తాజాగా నలుగురు వ్యోమగాములతో స్పేస్ X నౌక ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ లో నాసాకు చెందిన కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగికి ఎగిరింది. దీనికోసం 25 అంతస్తుల ఎత్తు ఉన్న భారీ వ్యోమనౌకను వినియోగించారు. దీన్ని రెండు దశల ఫాల్కన్ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. దీని పైభాగాన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ఆసీనులయ్యారు. ఈ బృందానికి నాసా వ్యోమగామి మైకేల్ లోపెజ్ అలెగ్రియా నాయకత్వం వహిస్తున్నారు. 20 గంటల ప్రయాణం అనంతరం వీరు శనివారం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటారని అంచనా వేశారు. రాకెట్ నుంచి విడిపోయిన అనంతరం స్వయం ఛోదిత క్రూ డ్రాగన్ క్యాప్సూల్ భూమికి 400 కి.మీ. ఎత్తులో ఐఎస్ఎస్‌కు అనుసంధానం అమవుతుంది. కాగా నలుగురు వ్యోమగాముల జాబితాలో ముగ్గురు టూరిస్టులు ఉన్నారు. వారిలో అమెరికాకు చెందిన లారీ కన్నోర్, కెనడా వాసి మార్క్ పాథీ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎయటేన్ స్టైబీ ఉన్నారు.
