South Korea Scrambles Jets After Detecting 180 North Korea Warplanes: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరుకున్నాయి. వరసగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో పదుల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా. ఉత్తర్ కొరియా చర్యను ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది దక్షిణ కొరియా. నార్త్ కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు దక్షిణ కొరియా సరిహద్దుల్లో పడ్డాయి.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో దక్షిణ కొరియా, జపాన్ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఏకంగా జపాన్ తన బుల్లెట్ ట్రైన్ సర్వీసులను నిలిపివేసింది. గురువారం ఉత్తరకొరియా ప్రయోగించిన ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం విఫలమై సముద్రంలో పట్టింది. అంతకుముందు జపాన్ మీదుగా క్షిపణులను ప్రయోగించింది.
Read Also: Pakistan: పాక్ రాజకీయం సమస్తం నెత్తుటి చరిత్రే.. తిరుగుబాట్లు, హత్యలే
ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం నాలుగు గంటల పాటు కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుకు ఉత్తరంగా 180 ఉత్తర కొరియా యుద్ధవిమానాలు ఎగరడాన్ని గుర్తించింది దక్షిణ కొరియా. దీనికి ప్రతిస్పందనగా తమ ఫైటర్ జెట్లు వాటిని తరిమేసినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఇరు ఫైటర్ జెట్ల మధ్య కాసేపు యుద్ధ తరహా విన్యాసాలు జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా విమానాలు మిలిటరీ డిమార్కేషన్ లైన్ కి ఉత్తరంగా 20 కిలోమీటర్ల వరకు లోపలికి వచ్చినట్లు దక్షిణ కొరియా పేర్కొంది. ఎఫ్-35ఏ స్టెల్త్ ఫైటర్ జెట్లను, 240 ఫైటర్ జెట్లను మోహరించినట్లు సౌత్ కొరియా సైన్యం పేర్కొంది.
అమెరికాలో పాటు దక్షిణకొరియా సంయుక్తంగా మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నాయి. దీనిని వ్యతిరేకిస్తోంది ఉత్తరకొరియా. దీంతో వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. గతంలో కూడా ఉత్తరకొరియాకు చెందిన 10 యుద్ధ విమానాలు ఇదే తరహా చర్యకు పాల్పడి దక్షిణ కొరియాను రెచ్చగొట్టాయి. ఇదిలా ఉంటే గురువారం రాత్రి సమయంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దిశగా 80 ఆర్టిటరీ షెల్స్ కాల్పులు జరిపింది.
