NTV Telugu Site icon

Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..

Snake On Plane

Snake On Plane

Snake on Plane: సాధారణంగా మన ఇంటికి పాములు వస్తే చాలా కంగారు పడుతుంటాము. అది వెళ్లిపోయే వరకు లేకపోతే చంపే వరకు నిద్రపోము. అలాంటిది విమానంలో పాము కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రయాణికులు ఎంతగా ఆందోళన చెందుతారో ఊహించుకోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. ప్రయాణికులు పామును గుర్తించడంతో విమానాన్ని తనిఖీ చేసి పామును బయటకు తీశారు.

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా నగరం నుంచి న్యూ జెర్సీకి వెళ్తున్న విమానంలో పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పామును పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్ అధికారులు మాట్లాడుతూ.. యునైటెడ్ ఫ్లైట్ 2038 నుంచి ‘ గార్టెడ్ స్నేక్’ను తొలగించామని, తర్వాత దాన్ని అడవిలో విడిచిపెట్టామని ప్రకటించారు. ఈ పామును పట్టే క్రమంలో ప్రయాణికులెవరూ గాయపడలేదని తెలిపారు.

Read Also: Teacher Beaten By Students: మానకొండూరులో దారుణం.. విద్యార్ధుల్ని చితకబాదిన టీచర్

ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ప్రయాణికులు పాము గురించి సిబ్బందిని అప్రమత్తం చేశారని.. పామును పట్టుకుని పరిస్థితి చక్కదిద్దడానికి అధికారులను పిలిచామని ప్రకటనలో వెల్లడించింది. న్యూజెర్సీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత టాక్సే వేకు వెళ్తున్న సమయంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణికులు పామును గుర్తించారు. ప్రయాణికులు కేకలు వేస్తూ.. తమ పాదాలను పైకి పెట్టుకున్నారు. పామును విమానం నుంచి పట్టుకున్న తర్వాత ప్రయాణికులు తమ సామానుతో విమానం నుంచి దిగారు.

సాధారణంగా గార్టెర్ పాములు ఫ్లోరిడాలో కనిపిస్తాయి. 18 నుంచి 26 అంగుళాల పొడవు ఉండే ఈ పాములు మానవులకు, జంతువులకు హాని కలిగించవు. అయితే ఉద్దేశపూర్వకంగా వేధిస్తేనే కాటు వేస్తాయి. దీని కాటువల్ల మానవుడికి పెద్దగా అపాయం ఉండదు. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో కూడా మలేషియాలో ఎయిర్ ఏషియా విమానంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. విమానం గాలిలో ఉండగా ప్రయాణికులు పామును గుర్తించారు.