Shooting in Mexico bar.. 12 people died: మెక్సికో దేశంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక నెల లోపు రెండు కాల్పుల ఘటనలు జరిగాయి. మెక్సికోలోని ఇరాపుయాటోలోని ఓ బార్ లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 12 మంది మరణించారు. ఇందులో ఆరుగురు మహిళల, ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇరాపుటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మెక్సికోలో గన్ ఫైరింగ్స్ ఎక్కువయ్యాయి.
అయితే ఇప్పటికీ ఈ దాడికి కారణాలు తెలియరాలేదు. ఈ రాష్ట్రంలో నెల వ్యవధిలో ఇది రెండో దాడి. అంతకు ముందు సెప్టెంబర్ నెలలో ఇరాపుటోకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో ఉణ్న గ్వానాజువాటో పట్టణంలోని టారిమోరోలోని బార్ లో కూడా ఇలాగే కాల్పలులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మెక్సికోలో డ్రగ్స్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీంతో వరసగా ఈ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Read Also: Bihar: బీహార్‌లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి
అక్టోబర్ 6న గెర్రెరో రాష్ట్రంలోని సిటీ హాల్ లో జరిగిన కాల్పుల్లో నగర మేయర్ తో పాటు 12 మందికి పైగా మరణించారు. ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయోల్ లోపెజ్ ఒబ్రాడార్ 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెక్సికోలో హింసను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ రక్తపాతానికి అడ్డుకట్ట పడటం లేదు.
ముఖ్యంగా లాటిన్ అమెరికాలోని మెక్సికో, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో మాదకద్రవ్యాలు పెద్ద ఎత్తున తయారు అవుతున్నాయి. వీటిని యూఎస్ కు తరలిస్తుంటారు స్మగ్లర్లు. అయితే మాదకద్రవ్యాల ముఠాల మధ్య ఘర్షణ అక్కడి ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే డ్రగ్స్ స్మగ్లింగ్ వల్ల వచ్చే డబ్బులతో అక్కడి అధికారులుకు లంచాలు ఇస్తుండటంతో ప్రభుత్వంలో అవినీతి బాగా పేరుకుపోయింది. దీంతో ప్రభుత్వాలు ఈ ముఠాలను దేశం నుంచి తుడిచిపెడదాం అని అనుకున్నా.. సాధ్యపడటం లేదు.
