బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కరెన్సీ నోట్ల నుంచి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. షేక్ ముజిబుర్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి. దేశ వ్యవస్థాపక నేత కూడా. అయితే జూలైలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో పరిస్థితిని అదుపు చేయలేక భారత్‌కు వచ్చేసి తలదాచుకుంటున్నారు. అనంతరం నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వరంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి.. హసీనా నిర్ణయాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా కరెన్సీ నోట్లపై హసీనా తండ్రి చిత్రాన్ని తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం కాకుండా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు కొత్త నోట్ల ముద్రణకు యూనస్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి బొమ్మలు లేకుండానే కరెన్సీ నోట్లు ముద్రణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో కొత్త నోట్లను మార్కెట్‌లో విడుదల చేయవచ్చని బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్నేరా శిఖా తెలిపారు. తొలుత నాలుగు నోట్ల డిజైన్‌ను మాత్రమే మారుస్తున్నట్లు కేంద్ర బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం లేకుండా అన్ని రకాల నోట్లు దశలవారీగా రీడిజైన్ చేయబడతాయని వారు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ విభాగం సెప్టెంబర్ 29న బంగ్లాదేశ్ బ్యాంక్‌కు కొత్త నోటు కోసం వివరణాత్మక డిజైన్ ప్రతిపాదనను సమర్పించింది. అయితే కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన ప్రధాన సిఫార్సును సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ అండ్ డిజైన్ అడ్వైజరీ కమిటీ చేస్తుందని వార్తాపత్రిక నివేదిక తెలిపింది.