Site icon NTV Telugu

Pakistan: పాక్‌లో “గుర్తుతెలియని వ్యక్తుల” హల్చల్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ యాక్టివ్ అయ్యారు. గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని అన్‌-నోన్ గన్‌మెన్ హతమారుస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్‌గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ సిటీలో ముజాహిద్ ఇంటి వెలుపల ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఉగ్రవాదిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Read Also: Indian Student Arrested: స్టోర్ లో దొంగ‌త‌నం చేస్తూ పట్టుబడిన మరో భారతీయ విద్యార్థిని..

హత్యకు గురైన ఉగ్రవాది షేక్ మోయిజ్ ముజాహిద్ చాలా కాలంగా లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఉగ్రసంస్థ ప్రధాన కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు ఇతను సన్నిహితుడు. మోయిజ్ హత్య తర్వాత స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని దుండగుల కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై ఐఎస్ఐ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ హతమారుస్తున్నారు. ముఖ్యంగా, భారత వ్యతిరేకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదిన్, ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పుడు ఉగ్రవాదులు హడలి చస్తున్నారు. ఎప్పుడు ఎలా మరణిస్తామో తెలియక ఆ దేశ ప్రభుత్వం నుంచి రక్షణ కోరుతున్నారు. అయితే, ఇప్పటి వరకు పోలీసులు కానీ, ఐఎస్ఐ కానీ ఒక్క గుర్తుతెలియని దుండగుడిని పట్టుకోలేకపోయింది.

Exit mobile version