Site icon NTV Telugu

Sheikh Hasina: బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.. షేక్ హసీనాకు మరణశిక్ష

Sheikh Hasina1

Sheikh Hasina1

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.

గతేడాది షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో ఆమె కట్టుబట్టలతో భారత్‌కు పారిపోయి వచ్చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలు నమోదు అయ్యాయి. హింసలో దాదాపు 1,400 మంది మరణించి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో హషీనాకు మరణశిక్ష విధించాలని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం డిమాండ్ చేశారు. తాజాగా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఆగస్టు 5, 2024న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని షేక్ హసీనా ఆదేశించారని తీర్పు న్యాయమూర్తి ప్రస్తావించారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని తెలిపారు. అధికారంలో ఉండేందుకు బలప్రయోగం కూడా చేశారని పేర్కొన్నారు.

షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంతో బంగ్లాదేశ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి ఉద్రిక్తతలు, అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే.. వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లో హసీనా ప్రసంగాలకు నిషేధం ఉన్న కూడా ఆదివారం అర్ధరాత్రి అవామీ లీగ్ ఫేస్‌బుక్‌లో హషీనా భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘భయపడటానికి ఏమీ లేదు. నేను బతికే ఉన్నాను. నేను బతుకుతాను. అల్లా ప్రాణం ఇచ్చాడు.. ఆయనే తీసుకుంటాడు. దేశ ప్రజలకు మద్దతు ఇస్తాను.’’ అని పేర్కొన్నారు. తీర్పుకు ముందు భావోద్వేగ ప్రసంగం చేయడంతో మద్దతుదారులు సోమవారం దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.

Exit mobile version