Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!

  • షేక్ హసీనాను పట్టుకొచ్చి ఉరితీస్తాం..
  • మాజీ ప్రధానిపై బంగ్లాదేశ్ కఠిన వైఖరి..
Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina Extradition: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో మరోసారి ఆ దేశం కఠిన వ్యాఖ్యలు చేసింది. 2024 ఆగస్టులో హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ పారిపోయి వచ్చి, ఇక్కడే నివసిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్ తిరిగి వస్తానని చెప్పింది. అయితే, ఈ విద్యార్థి ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె అధికారాన్ని ఉపయోగించిందని అక్కడి కోర్టులు హసీనాను దోషిగా తేల్చాయి. ఆమెకు మరణశిక్షను ఖరారు చేశాయి.

ఈ నేపథ్యంలో భారత్ తమకు షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. తాజాగా, బంగ్లా ప్రధాని తారిఖ్ రెహమాన్ సమాచార సలహాదారుడు జహీద్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. హసీనాను భారత్ నుంచి తీసుకువచ్చి, బంగ్లాదేశ్‌లో విధించిన మరణశిక్షను అమలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. ఢాకాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హసీనా స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ తిరిగి వచ్చే వరకు ఎదురు చూడకూడదని, చట్టపరమైన ప్రక్రియ ద్వారా ఆమెను భారత్ నుంచి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. హసీనాను అప్పగించాలనే డిమాండ్‌ను కేవలం భారత్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహాంగా ఉపయోగించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

హసీనా దేశానికి తిరిగి వచ్చిన వెంటనే మరణశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని జహీద్ అన్నారు. మరోవైపు, భారత్‌లో ఉంటూ హసీనా మీడియా సమావేశాలు నిర్వహించడాన్ని బంగ్లాదేశ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆమెను అప్పగించే వరకు ఇలాంటి కార్యక్రమాలు అడ్డుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. షేక్ హసీనాను అప్పగించిన తర్వాతే భారత్‌తో సాధారణ సంబంధాలు మెరుగవుతాయని బంగ్లా చెబుతోంది.