నూతన సంవత్సర వేళ స్విట్జర్లాండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోవాలో జరిగిన తీరు మాదిరిగా ఓ లగ్జరీ స్కీ రిసార్ట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయాలు పాలైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పేలుడు ఎలా సంభవించిందో తెలియదని.. అనేక మంది చనిపోయారని.. అలాగే చాలా మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లుగా పేర్కొన్నారు. న్యూఇయర్ వేడుకల్లో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మృతులంతా పర్యాటకులుగా తెలుస్తోంది. సెలవుల కోసం క్రాన్స్ మోంటానాకు వచ్చినట్లు సమాచారం. పేలుడు జరిగిన సమయంలో బార్‌లో దాదాపు 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో క్షతగాత్రులను తరలిస్తున్నారు. ఇక బాధితుల బంధువుల కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. అయితే సంగీత కచేరీ సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని స్విస్ వార్తా సంస్థ బ్లిక్ నివేదించింది.
