Secret Behind China People White Paper Protest: చైనాలో కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. అక్కడి ప్రభుత్వం కఠినమైన కొవిడ్ ఆంక్షలు విధించింది. జీరో కొవిడ్ విధానాన్ని అవలంభిస్తోంది. దీని వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ఈ నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. తియానన్మెన్ స్క్వేర్ ఆందోళన తర్వాత చైనాలో ఇవే అతిపెద్ద నిరసనలంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే.. చైనా ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు తెల్లకాగితాలను గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ ఆందోళనలను ‘తెల్లకాగితం విప్లవం’ లేదా ‘ఏ4 విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. చైనీయులు ఈ తెల్లకాగితాల్ని వినియోగించడం వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. సాధారణంగా చైనాలో ఎవరైనా ఆందోళనలు చేపడితే, దాన్ని మొగ్గదశలోనే అణచివేస్తారు. ఆందోళనకారుల పట్ల కఠినమైన చర్యలు సైతం తీసుకుంటారు. అలా అణచివేతకు గురవ్వకుండా ఉండేందుకే.. ఈ తెల్లకాగితం విప్లవం అనేది తెరమీదకి వచ్చింది. ప్రభుత్వాన్ని కానీ, వ్యక్తులను కానీ కించపర్చకుండా ఆందోళన చేపట్టడమే.. ఈ తెల్లకాగితం ఉద్యమం వెనుక ఆంతర్యం. దీంతోపాటు చైనాలోని సెన్సార్‌షిప్‌ను తెలియజేసేందుకు కూడా ఈ తెల్ల కాగితమే గుర్తుగా ఉంటుంది.
ఈ తెల్ల కాగితంతో ఆందోళనలు చేపడితే.. ఏమీ తెలియజేయకుండానే, అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఈ నిరసనల్ని చైనాలో తీవ్రంగా పరిగణిస్తారు. చైనాలోని ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో ఈ రకంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. అలాగే.. 2020లో హాంకాంగ్ ఆందోళనల్లో కూడా నిరసనకారులు తెల్లకాగితాన్ని తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జీరో కొవిడ్ వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలోనూ తెల్లకాగితాల్ని నిరసనకారులు తమ గుర్తుగా ఎంపిక చేసుకోవడంతో.. అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. అందుకే, ఈ ప్రదర్శనల్ని సోషల్ మీడియా నుంచి మాయం చేసేందుకు.. చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. టెక్ దిగ్గజాలైన టిక్‌టాక్, విబో వంటి వాటిని రంగంలోకి దింపి.. తెల్లకాగితం చిత్రాలను తొలగించే పనిలో పడింది.
ఇదిలావుండగా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే, చైనాలో మాత్రం మూడేళ్ల నుంచి పరిస్థితులు మారలేదు. అక్కడ జీరో కొవిడ్ విధానం కొనసాగుతూనే ఉంది. దీంతో.. గత నెలలో కొవిడ్ లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా ఝాంఝూలో కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. రీసెంట్‌గా షింజియాంగ్‌లో ఉరుంకీ నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందడంతో.. అక్కడి ప్రజలు రోడ్డుమీదకొచ్చారు. ఇప్పుడు ఆందోళనలు కొవిడ్ లాక్‌డౌన్లను దాటి.. షీజిన్‌పింగ్‌ను తొలగించాలనే వరకూ చేరుకున్నాయి.