Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌ను భీకర వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. దేశంలోని సగానికి పైగా భూభాగం వరదను ఎదుర్కొంటోందని ఓ పాక్ మంత్రి వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించేందుకు హెలికాప్టర్ దిగేందుకు కూడా స్థలం లేకపోవడంతో అక్కడి ప్రజలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జులై నుంచి దేశంలో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా అక్కడ ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు వరదల ధాటికి 1,136 మంది ప్రాణాలు కోల్పోగా.. 1575 మంది గాయపడ్డారు. సగానికి పైగా పాకిస్థాన్ వరద నీటిలోనే మగ్గిపోతోంది. దేశవ్యాప్తంగా వరదల వల్ల సుమారు 10 బిలియన్ల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ఆ దేశ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు. అయితే వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు సోమవారం ప్రత్యేక సాయం అందించింది ఐఎంఎఫ్. ఆదేశానికి 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఐఎంఎఫ్ రిలీజ్ చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌ను ఆదుకునేందుకు ఐఎంఎఫ్ ఆ సహాయాన్ని అందించింది.
పాకిస్థాన్‌లో రుతుపవనాల వల్ల ఆకస్మికంగా వచ్చిన వరదలతో సుమారు 33 మంది మిలియన్ల జీవితాలు ఆగమయ్యాయి. దేశంలోని 15 శాతం జనాభా వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వర్షాల వల్ల రోడ్లు, పంటలు, ఇండ్లు, బ్రిడ్జ్‌లు, ఇతర మౌళిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. రానున్న రోజుల్లో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని మంత్రి ఇక్బాల్ తెలిపారు. 2010లో వచ్చిన వరదల కన్నా ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 2010లో వరదల వల్ల దేశంలో రెండు వేల మందికిపైగా మరణించారు. 2010లో పాకిస్థాన్ చవిచూసిన ‘సూపర్ ఫ్లడ్’ కంటే ఇది తీవ్రమైంది. నాటి వరదల్లో 20 మిలియన్ల మంది ప్రభావితం అయ్యారు. దేశం సగం నీటిలో ఉందని పాక్ పత్రిక ‘డాన్’ ఏకంగా కథనం ప్రచురించింది.
ఈ సారి వరదల్లో 4,52,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2,18,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 8 లక్షల పశువులు చనిపోగా.. దాదాపు 20 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.పాక్‌లో సగం ఉండే బలోచిస్థాన్‌లో కనీసం 75శాతం భూభాగం వరదలకు ప్రభావితమైంది. ఆస్తి నష్టానికి అంతేలేదు. 4,100 కిలోమీటర్ల రోడ్లు, 149 వంతెనలు, టెలికాం, విద్యుత్తు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందని డాన్ పత్రిక కథనం పేర్కొంది. ఇప్పటికే పాకిస్థాన్ దేశవ్యాప్తంగా 354.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతమైన 113 కంటే మూడు రెట్లు అధికం. భవిష్యత్తులో మరిన్ని వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పాక్ వాతావరణ శాఖ అంచనావేస్తోంది.
5G Technology : దేశంలో 5జీ ప్రారంభానికి ముహూర్తం ఎప్పుడు..? 5జీతో ఏం మారబోతోంది..?
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో పరిస్థితి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సానుభూతి వ్యక్తం చేశారు. పాక్‌లో వరదల విధ్వంసం తనకు బాధను కలిగించిందని.. బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నామని ట్వీట్ చేశారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ మిత్రదేశమైన చైనా కూడా ఆ దేశ వరదలపై స్పందించింది. పాకిస్థాన్‌కు అవసరమైన సాయం అందించేందుకు ముందుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు.
