Saudi Arabia: ఇస్లాం దేశాల్లో మరణశిక్షలు సర్వసాధారణం. హత్యలు, డ్రగ్స్, వ్యభిచారం ఇలాంటి కేసుల్లో ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, యూఏఈ వంటి దేశాలు కఠినంగా వ్యవహరిస్తాయి. అయితే అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో మాత్రం శిక్షల విధింపు దాదాపుగా ఉండదు. అత్యంత అరుదుగా మాత్రమే శిక్షల్ని విధిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ఒకరికి ఉరిశిక్ష అమలు చేసింది. ఈ ఘటన మార్చి 28న జరిగింది. రంజాన్ ప్రారంభం అయిన 5 రోజుల తర్వాత నిందితుడిని ఉరితీసినట్లు జర్మనీ బెర్లిన్‌కు చెందిన యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ESOHR) ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Indigo flight: హైదరాబాద్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం?
నిందితుడు ఓ హత్యా నేరానికి పాల్పడ్డాడు. ఒకరిని పొడిచి, మంటలు అంటించి చంపిన కేసులో నిందితుడిని ఉరితీశారు. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ఉరిశిక్షలకు సంబంధించిన డేటాను విశ్లేషిస్తే 2009 నుంచి పవిత్ర రంజాన్ మాసంలో ఎటువంటి శిక్షలను అమలు చేయలేదు. గతంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ది అట్లాంటిక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హత్యలు, ప్రాణాలు తీసే సంఘటనకు మినహా మిగతా నేరాల్లో మరణశిక్షను అమలు చేయమని అన్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సౌదీ మొత్తం 17 మందికి మరణశిక్షలను అమలు చేసిందని హక్కుల సంస్థ వెల్లడించింది. 2021లో అత్యధికంగా 69 మందిని, 2022లో 147 మందికి మరణశిక్షలను అమలు చేసింది. గతంలో మాదకద్రవ్యాల నేరాలకు సంబంధించి మరణశిక్షలపై తాత్కాలిక నిషేధం ఉండేది. అయితే మూడేళ్ల తరువాత ఈ నిషేధానికి ముగింపు పలికింది సౌదీ. 2015లో కింగ్ సల్మాన్ అధికారం చేపట్టినప్పటి నుంచి 1,000 మందికి పైగా మరణశిక్షలను అమలు చేశారు. ఉరితీయడం, తలనరకడం ద్వారా మరణశిక్షలను అమలు చేసింది.