Saudi Arabia Houthi Attack: సౌదీ అరేబియాలో హౌతీ రెబల్స్ దాడి.. 11 మందికి గాయాలు.. ఇద్దరు భారతీయులకు తీవ్ర గాయాలు!

Saudi Arabia Houthi Attack

Saudi Arabia Houthi Attack

Saudi Arabia Houthi Attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. నగరంలోని ప్రముఖ కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ టవర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది గాయపడినట్లు సౌదీ పౌర రక్షణ విభాగం వెల్లడించింది. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ఇద్దరు సౌదీ పౌరులు, ఇద్దరు భారతీయులు, ముగ్గురు నేపాలీలు, నలుగురు ఈజిప్టు పౌరులు గాయపడ్డారు. కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ టవర్‌పై హౌతీ మిలీషియా ఉగ్రదాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత భద్రతా బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ఈ దాడిలో ఇద్దరు భారతీయులు గాయపడిన విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. బాధితులకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని, గాయపడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక Xలో ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులు స్థానిక చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ టవర్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిని సౌదీ నేతృత్వంలోని కూటమి అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. యెమెన్‌లోని అల్-హుదైదా గవర్నరేట్‌పై సౌదీ నేతృత్వంలోని కూటమి వైమానిక దాడులు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో సౌదీ అరేబియా, హౌతీ పాలకుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రియాద్‌లో జరిగిన తాజా దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా, నవంబర్ 19న కూడా రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ టవర్‌పై హౌతీ దాడి జరిగినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఆ సమయంలో భారీ పేలుడు శబ్దం రాజధానిలో కలకలం రేపింది. అయితే అప్పటి ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని సౌదీ పౌర రక్షణ విభాగం తెలిపింది. ఆ సమయంలో విడుదల చేసిన ఫొటోలో సౌదీ సార్వభౌమ సంపద నిధి (Public Investment Fund – PIF) ప్రధాన కార్యాలయం ఉన్న 80 అంతస్తుల భవనం కనిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది రియాద్‌లోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది.