Saudi Arabia: ఇస్లామిక్ దేశాల్లో ఉరిశిక్షలు సర్వసాధారణం. సౌదీ అరేబియాలాంటి దేశాల్లో వందలాది ఉరిశిక్షలు అమలవుతుంటాయి. 2025లో సౌదీ రికార్డు స్థాయిలో 356 మందికి ఉరిశిక్షల్ని అమలు చేసింది. ఒకే ఏడాదిలో మరణశిక్షలకు గురైన ఖైదీల విషయంలో సౌదీ రికార్డ్ సృష్టించింది. ఉరిశిక్షల పెరుగుదలకు ప్రధాన కారణం ‘‘మాదకద్రవ్యాలపై యుద్ధం’’ అని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. మొదటిసారిగా అరెస్టయిని వారిలో కూడా చాలా మంది ఇప్పుడు ఉరిశిక్షలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2025లో కేవలం డ్రగ్స్ సంబంధిత కేసుల్లోనే 243 మందికి ఉరిశిక్ష విధించారు. 2024లో సౌదీ 338 మందికి ఉరిశిక్ష విధించింది. సుమారు మూడు సంవత్సరాల పాటు మాదకద్రవ్యాల కేసులలో మరణశిక్షను నిలిపివేసిన తర్వాత, సౌదీ అరేబియా 2022లో మాదకద్రవ్యాల నేరాలకు ఉరిశిక్షలను తిరిగి ప్రారంభించింది.
Read Also: Congress: “రాహుల్ గాంధీ శ్రీరాముడట”.. కాంగ్రెస్ నాయకుడి “అతి భజన”పై బీజేపీ ఫైర్..
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం.. అరబ్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన సౌదీ అరేబియాలోకి క్యాప్టగాన్ అనే అక్రమ ఉత్ప్రేరకానికి అతిపెద్ద మార్కెట్ ఉంది. ముఖ్యంగా సిరియా నుంచి ఇది సరఫరా అవుతుంది. మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రారంభించినప్పటి నుండి, దేశం హైవేలు మరియు సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద పోలీసు తనిఖీ కేంద్రాలను పెంచింది. ఈ తనిఖీల్లో మిలియన్ల కొద్దీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. డజన్ల కొద్దీ స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఇలా పట్టుబడుతున్న వారిలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు.
అయితే, ఇలా విచ్చలవిడిగా ఉరిశిక్షలు అమలు చేయడం సౌదీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆధునిక దేశంగా మారాలని భావిస్తున్న సౌదీకి ఇది విరుద్ధమని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉరిశిక్షల అమలు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 సంస్కరణల ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అంటున్నారు. అయితే, పబ్లిక్ ఆర్డర్‌ను కాపాడటానికి మరణశిక్షలు అవసరమని అక్కడి అధికారులు వాదిస్తున్నారు.
