Site icon NTV Telugu

S Jaishankar: ఉక్రెయిన్ మంత్రితో సమావేశం అయిన జైశంకర్.. యుద్ధం ముగించే మార్గాలపై చర్చ

Jai Shankar

Jai Shankar

S Jaishankar Meets Ukraine Minister To Discuss Ways To End Russia War: కంబోడియా వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో భేటీ అయ్యారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించే మార్గాలపై చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన కోసం జైశంకర్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. కంబోడియా రాజధాని నమ్ పెన్ లో జరుగుతన్న ఆసియాన్ – ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జైశంకర్, కుబేలాను కలిశారు.

Read Also: Guinness World Record: రికార్డ్ బద్దలు.. 24 గంటల్లోనే అత్యధిక బార్‌లు తిరిగేశాడు..

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిని కలవడం సంతోషంగా ఉందని.. ఇటీవల పరిణామాలు, ధాన్యం చొరవ, అణు ఆందోళనలపై చర్చించనట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ రష్యా పర్యటన ముగిసిన రెండు రోజుల తర్వాత ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైన తర్వాత జైశంకర్ మాస్కోకు వెళ్లడం ఇదే తొలిసారి. భేటీ అనంతరం ఉక్రెయిన్ ఫారిన్ మినిష్టర్ కులేబా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగించే మార్గాలపై చర్చించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రష్యా వెంటనే ఘోరమైన దాడులను విరమించుకోవాలని.. ఉక్రెయిన్ నుంచి అన్ని దళాలను ఉపసంహరించుకోవాలని, శాంతికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రపంచ ఆహార భద్రతపై దృష్టి సారించినట్లు కులేబా అన్నారు.

ఉక్రెయిన్ పై రష్యా దాడిపై భారతదేశం తటస్థంగా ఉంది. ఇరు దేశాలు దౌత్యం, చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని భారత్ కోరుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం అయిన తర్వాత పలుమార్లు ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇది యుద్ధాల యుగం కాదని అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రపంచదేశాలు స్వాగతించాయి. అక్టోబర్ 4న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో మాట్లాడుతూ.. శాంతి ప్రయత్నాలకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.

Exit mobile version