Bashar al-Assad: సిరియాలో బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 5 దశాబ్ధాలుగా ఆ దేశంలో అస్సాద్ కుటుంబ పాలన ముగిసింది. ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) తిరుగుబాటుదారులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 15 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇదిలా ఉంటే, బషర్ ఫ్యామిలీలో సహా అతను కూడా రష్యాకు పారిపోయాడు. ఇన్నాళ్లు బషర్‌కి అండగా ఉన్న ఇరాన్, రష్యాలు తిరుగుబాటుదారుల ముందు తలవంచాయి.
ఇదిలా ఉంటే, తిరుగుబాటుదారులకు చిక్కితే బషర్ ప్రాణాలకు ప్రమాదం అని ముందే తెలిసిన రష్యా, ఆయనను సిరియా నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అత్యంత సురక్షిత మార్గంలో ఆయనను రష్యాకు తరలించినట్లు డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అసద్‌కి ఆశ్రయం ఇచ్చేందుకు పుతిన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ‘‘ అతను (బషర్ అల్ అస్సాద్) సురక్షితంగా ఉన్నాడు. ఇలాంటి అసాధారణ పరిస్థితిలో రష్యా అవసరమైన విధంగా వ్యవహరిస్తుందని ఇది చూపిస్తుంది’’ అని సెర్గీ ర్యాబ్కోవ్ అన్నారు.
విచారణ కోసం అతడిని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ)కి అప్పగిస్తారా..? అనే ప్రశ్నకు బదులుగా ఐసీసీలో రష్యా భాగస్వామి కాదని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రష్యా ఇకపై బషర్ అల్ అస్సాద్ పాలనకు మద్దతు ఇవ్వలేమని, హెచ్‌టీఎస్‌పై పోరాటంలో ఓడిపోతామని అసద్‌ని ఒప్పించింది. అతడి కుటుంబాన్ని సురక్షితంగా రష్యాకు తీసుకువచ్చే సీక్రెట్ ప్లాన్ ప్రారంభించింది. రష్యా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు సిరియాలోని వైమానికి స్థావరం ద్వారా అస్సాద్‌ని ఎయిర్ లిఫ్ట్ చేసింది. అతను సిరియా దాటిని కొన్ని గంటల్లోనే తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ని స్వాధీనం చేసుకున్నారు.