Site icon NTV Telugu

Ukraine Russia War: పుతిన్‌కు షాక్.. భారీస్థాయిలో సైన్యాన్ని కోల్పోయిన రష్యా

Ukraine Russia War

Ukraine Russia War

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర..పుతిన్ సేనలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అంగీకరించారు. తమ సైనికుల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడం, అక్కడి నాజీ తత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమంటూ ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌పై బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అంతులేని విషాదాలు వెలుగుచూస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలి, వలస బాటపట్టారు. అయినా సరే, ఉక్రెయిన్‌ రష్యాను గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఊహించని రష్యా భారీ స్థాయిలో సైన్యాన్ని కోల్పోతోంది. ఇప్పటివరకూ ఆ సంఖ్య సుమారు 18 వేల వరకూ ఉండొచ్చని ఉక్రెయిన్ చెప్పగా.. రష్యా చెప్తోన్న సంఖ్య అందుకు ఎన్నో రెట్లు తక్కువగా ఉంది. అయితే భారీ విషాదం అంటూ పుతిన్ ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా స్పందన వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.

Read Also: Sri Lanka Crisis: శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం.. అవిశ్వాసం టెన్షన్‌..!

మరోవైపు ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూనే.. ఆ దేశంపైనే తీవ్ర ఆరోపణలు చేస్తోంది రష్యా. విచక్షణారహిత దాడులకు పాల్పడుతూ అమాయక ప్రాణాలకు బలిగొంటూ..ఆ దాడులు ఉక్రెయిన్‌ చేసిందని ఆరోపిస్తోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌లోని రైల్వే స్టేషన్‌పై మిస్సైల్‌ దాడులు జరిగాయి. ఈ ఘటనలో 50 మంది మృతిచెందగా.. 400 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది రష్యా. రైల్వేస్టేషన్‌పై రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. యుద్ధక్షేత్రంలో మాకెదురుగా నిలబడే ధైర్యం, బలం లేక.. అసహనం, విరక్తితో ఉక్రెయిన్‌ పౌర జనాభాను నాశనం చేస్తున్నారని రష్యా బలగాలపై విరుచుకుపడ్డారు. మొత్తానికి ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా భారీగానే నష్టపోతుంది. ఇన్నాళ్లకు ఈ నిజాన్ని అంగీకరించింది పుతిన్‌ సర్కార్.

Exit mobile version