Russian Rapper Kills Himself To Avoid Serving In War Against Ukraine: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు.. సైనిక సమీకరణ ప్రక్రియను రష్యా ముమ్మరం చేస్తోన్న సంగతి తెలిసిందే! సుమారు మూడు లక్షల మంది సైనికుల్ని రిక్రూట్ చేయాలని నిర్ణయించిన రష్యా.. సైన్యంలో చేరాల్సిందిగా రష్యా పౌరులకు నోటీసులు పంపుతోంది. అయితే.. దీనిపై రష్యా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఎక్కడ సైన్యంలో చేరాల్సి వస్తుందా? అనే భయంతో.. చాలామంది రష్యా వీడుతున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టులన్నీ మునుపెన్నడూ లేని విధంగా.. ప్రయాణికులతో నిండిపోయాయి. అయితే.. ఓ రష్యన్ ర్యాపర్ మాత్రం అలా పారిపోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. సైన్యంలో చేరాలని నోటీసులు అందుకున్న ఆ ర్యాపర్.. యుద్ధం పేరుతో తాను ఏ ఒక్కరినీ కూడా చంపలేనని పేర్కొంటూ తనువు చాలించాడు.
ఆ రష్యన్ ర్యాపర్ పేరు ఇవాన్ విటలీవిచ్ పెటునిన్. అతని వయసు 27 ఏళ్లు. వాకీ పేరుతో అతడు స్టేజ్ షోలు నిర్వహిస్తాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన ఈ ర్యాపర్.. సెప్టెంబర్ 30వ తేదీన బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్రాస్నోడార్ నగరంలోని ఓ భవనం 10వ అంతస్తు నుంచి దూకి అతడు ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని అతని తల్లి, ప్రియురాలు ధృవీకరించారు. ఇవాన్ సూసైడ్ చేసుకున్న వ్యవహారం అక్కడ కలకలం రేపింది. మంచి పేరున్న ర్యాపర్.. ఎందుకిలా సూసైడ్ చేసుకున్నాడన్న చర్చలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. సైన్యంలో చేరాలంటూ నోటీసులు రావడం వల్లే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తేలింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు.. అతడు తీసుకున్న సెల్పీ వీడియోలో ‘యుద్ధంలో ఎవ్వరినీ చంపలేను’ అనే కారణం తెలిపి, చనిపోయినట్టు తేలింది.
మీడియా కథనం ప్రకారం.. ‘‘యుద్ధం పేరుతో నేను ఏ ఒక్కరినీ చంపలేను. ఒకవేళ చంపాల్సి వస్తే, ఆ పాపాన్ని నేను మోయలేను. ప్రస్తుతం జరుగుతోంది పాక్షిక సైనిక సమీకరణ అని చెప్తున్నారు కానీ, మరికొన్ని రోజుల్లో అది పూర్తిస్థాయిలో జరుగుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ఉన్మాది. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను బ్రతికి ఉండను’’ అంటూ ఇవాన్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కాగా.. ఇవాన్ గతంలో రష్యా సైన్యంలో పని చేశాడని, అతడు మానసిక చికిత్స కూడా తీసుకున్నాడని అమెరికా మీడియా వెల్లడించింది. మరోవైపు.. సెప్టెంబర్ 21న పుతిన్ సైనిక సమీకరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 2లక్షల మంది రష్యన్లు, సమీప దేశాలకు వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
