Site icon NTV Telugu

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. లీసీచాన్స్క్‌పై పట్టుకు యత్నం

Russia Missile Attack On Ukraine

Russia Missile Attack On Ukraine

దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న రష్యా.. అనూహ్యంగా ఇతర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఒక్క రోజు వ్యవధిలోని 50కి పైగా రాకెట్లను పుతిన్‌ సేనలు సంధించాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని లీసీచాన్స్క్‌పై పట్టు సాధించడానికి రష్యా బలగాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. దీనికి సమీపంలోని సీవీరోదొనెట్స్క్‌పై కొన్ని వారాలుగా అప్రతిహతంగా దాడులు కొనసాగించిన తర్వాత అక్కడి నుంచి ఉక్రెయిన్‌ సేనలు వైదొలగే పరిస్థితిని తీసుకురాగలగడంతో పుతిన్‌ సేనలు ఈ నగరం దిశగా వెళ్తున్నాయి. లీసీచాన్స్క్‌తో సంబంధాల్లేకుండా చేయాలని రష్యా చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఉక్రెయిన్‌ సైన్యం వెనుదిరగడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తూర్పు ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న నగరాలపైనా క్షిపణి దాడుల్ని రష్యా మొదలుపెట్టింది. దక్షిణం వైపు నుంచి తమను దిగ్బంధించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని లుహాన్స్క్‌ ప్రాంత గవర్నర్‌ సెర్హీ హైదై తెలిపారు.

తాజాగా నల్ల సముద్రం నుంచి పశ్చిమాన ల్వీవ్‌ రీజియన్‌లో ఉన్న యారోవ్‌ మిలటరీ బేస్‌పై రష్యా క్షిపణులను వదిలింది. ఇక్కడ ఉక్రెయిన్‌ ఫైటర్లతో పాటు విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన సైనికులూ ఉన్నారు. మార్చిలో ఈ బేస్‌పై రష్యా చేసిన దాడిలో 35 మంది మృతి చెందారు. బెలారస్‌ నుంచి ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహైవ్‌పై 20 రాకెట్లతో దాడి చేసింది. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని జైటోమిర్‌ రీజియన్‌పై శనివారం ఉదయం దాదాపు 30 రాకెట్లను ప్రయోగించింది. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు సీవీరోదొనెట్స్క్‌, లీసీచాన్స్క్‌ కీలకమనే ఉద్దేశంతో పుతిన్‌ సేనలు మొదటి నుంచి వీటిపై దృష్టి సారించాయి. ఇప్పటికే రష్యా దాడుల ధాటికి సీవీరోదొనెట్స్స్‌ మొత్తం శిథిలాల కుప్పగా మిగిలింది. ఒకప్పుడు 10 లక్షల మంది జనాభా ఉండే ఆ నగరంలో ఇప్పుడు 10,000 మంది కూడా లేరు. అక్కడి అజోట్‌ రసాయన కర్మాగారంలో 500 మంది పౌరులతో పాటు కొందరు ఉక్రెయిన్‌ సైనికులు తలదాచుకున్నారు.

Exit mobile version