Site icon NTV Telugu

Ukraine Russia War: మళ్లీ విరుచుకుపడుతోన్న రష్యా..

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర యుద్ధం చేస్తోంది.. రెండు దేశాల మధ్య యుద్ధం 44వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్‌ దాడులతో విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులు, రాకెట్‌ దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్‌ నుంచి పుతిన్‌ సేనలు నిష్క్రమించినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్స్‌ ప్రాంతం క్రమటోర్స్క్‌ రైల్వే స్టేషన్‌పై జరిగిన రెండు మిసైల్‌ దాడుల్లో కనీసం 35 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మిస్సైల్‌ దాడులతో రైల్వే స్టేషన్‌ జనం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు జనాన్ని తరలిస్తున్న సమయంలో ఈ స్టేషన్‌లో దాడులు జరగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

Read Also: TSRTC: మళ్లీ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. డీజిల్‌ సెస్‌ పేరుతో భారీగా వడ్డింపు..

మరోవైపు, ఖర్కివ్‌ ప్రాంతం రష్యా బలగాల కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. 24గంటల వ్యవధిలో 48సార్లు కాల్పులు జరిగాయి. రష్యా బలగాలునివాస ప్రాంతాలపై దాడి చేసేందుకు ఫిరంగిలు, యుద్ధ ట్యాంకులు, బహుళ ప్రయోగ రాకెట్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. అటు రష్యా దూకుడును ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. శత్రుసేనల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పట్నుంచి 19వేల మందికి పైగా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ప్రకటించింది. 150 విమానాలు, 135 హెలికాప్టర్లు, 700 ట్యాంకులు, 1891 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ నుంచి బహిష్కరించినప్పటికి రష్యా దూకుడు తగ్గడం లేదు. రష్యా దళాల దాడుల తర్వాత అనేక ఉక్రెయిన్ నగరాల్లో భవనాలు, రోడ్లు, రవాణా వ్యవస్థ పూర్థి స్థాయిలో ధ్వంసమయ్యాయి. సాధారణ పౌరుల మరణాల కేసులు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులపై జరుగుతున్న దాడులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version