Site icon NTV Telugu

Russia: మాస్కోపై డ్రోన్ అటాక్.. అమెరికా, నాటో పనే అని రష్యా ఆరోపణలు..

Uraine War

Uraine War

Russia: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం డ్రోన్ అటాక్ జరిగింది. రాజధాని సమీపంలో ఐదు డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఈ చర్యకు అమెరికా, నాటోనే కారణం అని.. వీటి సాయం లేకుండా రష్యా భూభాగంపై డ్రోన్ దాడులు సాధ్యం కాదని రష్యా ఆరోపించింది. మరోవైపు ఉక్రెయిన్ లోని తూర్పు ఖార్కివ్ ప్రాంతంలోని పెర్వోమైస్కీ పట్టణంలో రష్యా జరిపిన దాడిలో 12 మంది చిన్నారులు సహా 43 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది.

Read Also: Madhya Pradesh: నిందితుడిని విడిచిపెట్టొద్దు.. గిరిజనుడిపై మూత్రవిసర్జన ఘటనపై సీఎం ఆదేశాలు

రష్యాపై డ్రోన్ దాడిని ‘‘ఉగ్రవాద చర్య’’గా పేర్కొంది. ఉక్రెయిన్ కు నాటో, అమెరికా, ఇతర మిత్రదేశాలు అందించిన సాయంతోనే డ్రోన్ దాడి జరిగిందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వెస్ట్రన్ దేశాలు డ్రోన్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నాయని.. దాడులకు అవసరమైన సాయం చేస్తున్నాయని రష్యా నిందించింది. ఇటీవల కాలంలో రష్యాపై జరిగిన రెండో డ్రోన్ అటాక్ ఇది. గతంలో ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యన్ పట్టణాలపై దాడులు జరిగాయి. తాజాగా మంగళవారం జరిగిన దాడిలో మొత్తం 5 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ప్రకటింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.

మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 కిలోమీటర్ల దూరంలో ఒక డ్రోన్ ను కూల్చేసినట్లు, కొద్దిసేపు విమాన సేవలకు అంతరాయం ఏర్పడినట్లు రష్యా తెలిపింది. ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున రష్యా 22 ఇరాన్ డ్రోన్లను, మూడు క్షిపణులను ఉక్రెయిన్ లోని సుమీ, డొనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలపై ప్రయోగించినట్లు కీవ్ ఆరోపించింది. ఉక్రెయిన్ బలగాలు 16 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. రష్యా జరిపిన దాడిలో మంగళవారం ఉక్రేనియన్ రచయిత్రి విక్టోరియా అమెలీనా మరణించింది.

Exit mobile version