Rishi Sunak’s Indian Connections: భారతదేశాన్ని శతాబ్ధాల పాటు పాలించిన బ్రిటన్ కు తొలిసారి భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం యూకే ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఒక్క రిషి సునాక్ మాత్రమే గట్టెక్కించగలడనే అభిప్రాయం అక్కడి ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో మెజారిటీ ఎంపీలు రిషి సునాక్ కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే 170కి పైగా ఎంపీలు మద్దతు తెలిపారు. మరోవైపు సునాక్ ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ మోర్డాంట్ కు కేవలం 29 మంది ఎంపీలే మద్దతు తెలిపారు. దీంతో రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయం అయింది.
యార్క్ షైర్ ఎంపీగా బ్రిటన్ పార్లమెంట్ లో పదవీ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై ప్రమాణం చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. రిషి సునక్ బ్రిటన్ లో ఉంటున్నా కూడా భారతీయ సంప్రదాయాలను, మూలాలను మరిచిపోలేదు. రిషి సునాక్ తల్లిదండ్రులు భారతసంతతికి చెందినవారు. 1960ల్లో తూర్పు ఆఫ్రికా నుంచి వీరిద్దరు యూకేకి వలసవెళ్లారు. పంజాబ్ మూలాలు ఉన్న రిషి సునాక్ పూర్వీకులు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లారు. రిషి సునాక్ 12 మే 1980న ఇంగ్లాండ్‌లో ఉషా సునాక్, యశ్వీర్ సునాక్ లకు జన్మించారు.
Read Also: India World Record: పాక్‌పై విజయంతో.. ఆ వరల్డ్ రికార్డ్ బద్దలుకొట్టిన భారత్
రిషి సునాక్, భారతీయ మహిళ అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె. వారిద్దరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఛాన్సలర్ గా ఉన్న రిషి సునక్ డౌనింగ్ స్ట్రీట్ లో కుటుంబంతో దీపావళి వేడుకలు జరుపుకోవడం అప్పట్లో ప్రముఖ వార్తగా నిలిచింది. రిషి సునక్ తన వారసత్వం గురించి, కుటుంబం, సంస్కృతి గురించి మాట్లాడుతుంటారు. గతంలో తన అత్తామామలను కలిసేందుకు బెంగళూర్ కూడా వచ్చారు ఆయన. ఈ ఏడాది ఆగస్టు నెలలో కృష్ణాష్టమి సందర్భంగా సునాక్ దంపతులు ‘‘ గో పూజ’’ నిర్వహించడం వైరల్ గా మారింది.
ప్రధాని ఎన్నికల ప్రచారం సమయంలో రిషి సునక్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఖరీదైన సూట్లు, బూట్లు, విలాసవంతమైన ఇల్లు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఒత్తిడిలో కూడా భగవద్గీత తనను కాపాడుతుందని, తన విధిని గుర్తు చేస్తుందని రిషి చెబుతుంటారు. ఫిట్ గా ఉండేందుకు క్రికెట్ ఆడుతుంటారు రిషి సునాక్.
