Site icon NTV Telugu

World Press Photo of the Year: వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్న మహ్మద్ సలేం..ఆయన తీసిన ఫోటో ఇదే..

2024 World Press Photo Of The Year Award

2024 World Press Photo Of The Year Award

World Press Photo of the Year: ప్రతిష్టాత్మక 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుని రాయిటర్స్‌కి చెందిన ఫోటోగ్రాఫర్ మహ్మద్ సలేం గెలుచుకున్నారు. గాజా స్ట్రిప్‌లో విధ్వంసాన్ని సూచించే విధంగా ఆయన తీసిన ఫోటోకి ఈ అవార్డు వచ్చింది. ఓ మహిళ తన ఐదేళ్ల మేనకోడలి మృతదేహాన్ని హత్తుకుని విలపించే ఫోటోకి ఈ అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 17, 2023న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని నాజర్ హస్పిటల్‌లో తీశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ బాంబుల దాడిలో మరణించిన వారి కోసం వారి కుటుంబ సభ్యులు వెతుకుతుండటం కనిపించింది. 36 ఏళ్ల ఇనాస్ అబు మామర్ ఆస్పత్రి మార్చురీలో తెల్లని వస్త్రంలో కప్పబడిని సాలీ శరీరాన్ని పట్టుకుని ఏడుస్తున్న క్షణాన్ని సలేం చిత్రీకరించారు.

ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ ఫోటో ఫౌండేషన్ తన వార్షిక అవార్డులను ప్రకటిస్తూ.. సంఘర్షణను కవర్ చేసే పాత్రికేయులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చారు. 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. ఈ యుద్ధాన్ని కవర్ చేస్తున్న 99 మంది జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులు మరణించారు.

Read Also: Ajit Pawar: ‘ద్రౌపది లాంటి పరిస్థితి వస్తుంది’.. వివాదాస్పదమైన అజిత్ పవార్ వ్యాఖ్యలు..

పాలస్తీనాకు చెందిన 39 ఏళ్ల మహ్మద్ సలేం 2023 నుంచి రాయిటర్స్‌లో పనిచేస్తున్నారు. 2010 వరల్డ్ ప్రెస్ ఫోటో పోటీలో కూడా అతను అవార్డును గెలుచుకున్నాడు. హమాస్ దాడికి సామాన్య పాలస్తీనా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే గాజా నగరం ధ్వంసమైంది. చాలా మంది నగరాన్ని వదిలి దక్షిణాది వైపు వెళ్లారు. ఇప్పటికే 30,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

‘‘ గాజా స్ట్రిప్‌లో ఏం జరుగుతుందనే దాన్ని ఈ ఫోటో ప్రతిబింబిస్తుందని నేను భావించాను, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పరిగెత్తారు. తమ ప్రియమైన వారి పరిస్థితి తెలుసుకోవాలని ఆత్రుతలో ఉన్నారు. ఓ మహిళ చిన్న అమ్మాయి మృతదేహాన్ని పట్టుకుని వదిలివేయడానికి నిరాకరించడం నా దృష్టిని ఆకర్షించింది’’ అని అవార్డు గెలుచుకున్న మహ్మద్ సలేం చెప్పారు. ఈ అవార్డు కోసం 130 దేశాల నుంచి 3,851 ఫోటోగ్రాఫర్‌ల ద్వారా 61,062 ఎంట్రీలు వచ్చాయి. దక్షిణాఫ్రికాకు చెందిన GEO ఫోటోగ్రాఫర్ లీ-ఆన్ ఓల్వేజ్ మడగాస్కర్‌లో చిత్తవైకల్యాన్ని డాక్యుమెంట్ చేసే చిత్రాలతో స్టోరీ ఆఫ్ ది ఇయర్ కేటగిరీని గెలుచుకున్నారు.

Exit mobile version