NTV Telugu Site icon

Pakistan Elections: పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్, రీపోలింగ్‌కి ఆదేశం.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా ఆందోళనలు..

Pakistan

Pakistan

Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. దీంతో ఆ దేశంలో విజేత ఎవరనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిచ్చారు. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్‌కి పాక్ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 15న రీపోలింగ్ జరగనుంది.

Read Also: Acharya Pramod: కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ బహిష్కరణ.. ‘‘రాముడి విషయంలో రాజీ లేదని రిఫ్లై‘‘

24 కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న 226 స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయకున్నా, అతడి పార్టీ గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేసిన అతని మద్దతుదారులు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగి 100 స్థానాలను కైవసం చేసుకున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ‘‘పాక్ ముస్లిం లీగ్-నవాజ్’’ 72 స్థానాల్లో, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 54 స్థానాల్లో, ఇతర చిన్నాచితక పార్టీలు 27 సీట్లు గెలుచుకున్నాయి. 133 మెజారిటీ మార్కు కాగా..ఏ ఒక్క పార్టీ కూడా క్లియర్ మెజారిటీని సంపాదించుకోలేదు.

ఇదిలా ఉంటే, తానే విజయం సాధించినట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. భుట్టో పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. నవాజ్ పార్టీకి పాకిస్తాన్ ఆర్మీ సపోర్టు కూడా ఉంది. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ విజయం సాధించానని చెప్పుకున్నారు. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.