Joe Biden: రష్యాలోని ప్రైవేటు సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతిపై అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రిగోజిన్ మృతిలో తనకు ఆశ్యర్చమేమీ లేదని వ్యాఖ్యానించారు. రష్యాలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇది తాను ముందే ఊహించానని సంచలన కామెంట్ చేశారు. అక్కడ ఏమీ జరిగిందో తనకు కచ్చితంగా తెలియదని.. కానీ రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోయారనే వార్తలపై తాను ఆశ్చర్యపోలేదన్నారు. ఇది తాను ముందే ఊహించినట్లు చెప్పారు. ఉక్రెయిన్ కూడా ప్రిగోజిన్ మృతిపై స్పందించింది. వాగ్నర్ చీఫ్ మరణం రష్యాలోని ప్రముఖులకు ఓ హెచ్చరికలాంటిదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సహాయకుడు మిఖైలో పొడొలియాక్ అన్నారు. ఈ ఘటన ద్వారా తనకు విశ్వాసంగా ఉండకపోతే మరణం తప్పదని పుతిన్ వారికి హెచ్చరికలు పంపించినట్టని పేర్కొన్నారు. రష్యాలో ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం కుప్పకూలిపోవడంతో అనుచరులతో సహా ఆయన కూడా మరణించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కూడా పాల్గొంది. ప్రిగోజిన్ స్వయంగా తన దళాలను ముందుండి నడిపించారు.
Read Also: Team India Captain: రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో టీమిండియాకు అతడే కెప్టెన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రిగోజిన్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ప్రిగోజిన్‌ను పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటికొచ్చాక పలు వ్యాపారాలు చేశాడు ప్రిగోజిన్. 1990ల్లో పుతిన్‌కు ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త స్నేహంగా మారింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. తరువాత కాలంలో ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తుండేవాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి.