Site icon NTV Telugu

America Heavy Rains: అమెరికాలో వర్ష బీభత్సం.. వేల విమానాలు రద్దు

America

America

America Heavy Rains: ఈమధ్య కాలంలో వాతావరణంలో పెను మార్పుల కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీవర్షాలతో వరదలు ఆయా రాష్ట్రాల్లోని ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఇప్పటికీ వరదల నుంచి ప్రజలు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇక చైనాలో సైతం టోర్నడోలు వర్షాలతో దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికీ దేశ రాజధాని బీజింగ్‌లో వరదలు కొనసాగుతున్నాయి. ఇంకా వరదల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇపుడు అగ్ర రాజ్యమైన అమెరికాలోనూ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలో భారీ తుఫాన్‌ మూలంగా దేశ వ్యాప్తంగా వేలాది విమానాలను రద్దు చేశారు. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షంతోపాటు.. వడగళ్లతో అగ్రరాజ్యం వణుకుతోంది.

Read also: Meher Ramesh: కొంప ముంచిన ‘క్రింజ్’ కామెంట్లు.. దెబ్బకి దిగొచ్చిన మెహర్ రమేష్

తుఫాన్‌ ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది. తుపాను మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. దేశంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వేలాది విమానాలను రద్దు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలు చీకట్లో ఉన్నారు. తుపాను కారణంగా వాషింగ్టన్‌ డీసీ (Washington D.C)లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను ముందుగానే మూసివేశారు. టేనస్సీ నుంచి న్యూయార్క్ వరకు దాదాపు 10 రాష్ట్రాలు ఈదురు గాలుల్లో చిక్కుకున్నాయి. సుమారు 29.5 మిలియన్లకు పైగా ప్రజలు ఈ తుపానుకు ప్రభావితులైనట్లు అమెరికా వెదర్ సర్వీస్ ప్రకటించింది. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, ఫిలడెల్ఫియా, అట్లాంటా విమానాశ్రయాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. సోమవారం రాత్రి నాటికి 2,600 కంటే ఎక్కువ యూఎస్ విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. 7,900 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మేరీల్యాండ్‌, వర్జీనియా సహా దక్షిణ, మధ్య అట్లాంటిక్‌ రాష్ట్రాల్లో సుమారు 11 లక్షల ఇళ్లతోపాటు వాణిజ్య సముదాయాలకు కరెంట్‌ సరఫరా ఆగిపోయింది. అమెరికాలో కొనసాగుతున్న భీకర తుఫాను మూలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నట్టు వార్త కథనాలు చెబుతున్నాయి.

Exit mobile version