Site icon NTV Telugu

Rahimullah Haqqani: ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి దాడిలో తాలిబన్ మతగురువు మృతి

Rahimullah Haqqani

Rahimullah Haqqani

Taliban cleric Killed In ISIS Suicide Blast : తాలిబన్ మత గురువు, ఆప్ఘాన్ లో కీలక నేతగా ఉన్న రహీముల్లా హక్కానీని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఐఎస్ఐఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఆయన్ను ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. గురువారం రహీముల్లా హక్కానీ.. కాబూల్ లోని అతని మదర్సాలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో హక్కానీతో పాటు అతని సోదరుడు మరణించారని తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గతం రెండు మూడు సార్లు హత్యా ప్రయత్నాల నుంచి రహీముల్లా హక్కానీ బయటపడ్డారు. ప్రస్తుతం జరిగిన దాడిలో ఇద్దరు మరణించడంతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు.

హక్కానీ తాలిబన్లకు ముఖ్యమైన మతగురువుగా ఉన్నారు. ఈయన తాలిబన్ కు ఉన్న ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వంలో ఏ పదవిలో లేకపోయినా.. హక్కానీ ప్రభావవంతమైన నేతల్లో ఒకరుగా ఉన్నారు. హక్కానీ మరణం పట్ల తాలిబన్ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆప్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐసిస్ ఉగ్రవాద సంస్థ మైనారిటీలైన షియాలు, హజారా తెగలపై దాడులకు తెగబడుతోంది. గతంలో మసీదులపై జరిపిన పలు ఆత్మాహుతి దాడుల్లో అనేెక మందిని చంపేసింది.

READ ALSO: Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. వలస కూలీ దారుణహత్య

తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఐసిస్ కు వ్యతిరేకంగా రహీముల్లా హక్కానీ ఆవేశపూరిత ప్రసంగాలు ఇచ్చారు. దీంతో పాటు బాలిక విద్యను కూడా ఈయన ప్రోత్సహించారు. పాఠశాలలకు వెల్లే బాలికల హక్కును ఆయన సమర్థించారు. మహిళా విద్యకు అనుమతి లేదని చెప్పడానికి షరియాలో ఎలాంటి నియమాలు లేవని బీబీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో అన్నారు. తాలిబన్ నాయకులు ఆప్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టి ఈ ఆగస్టు 15కు ఒక ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంగా ఐఎస్ఐఎస్ ఆప్ఘనిస్తాన్ లో పదుల సంఖ్యలో దాడులకు తెగబడింది. ఏడాది కాలంగా బాలికల విద్యను తాలిబన్లు అనుమతించడం లేదు. అయితే పాశ్చాత్య దేశాల ఒత్తడి మేరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సెకండరీ పాఠశాలలు తెరవడానికి అనుమతి ఇచ్చారు.

Exit mobile version