Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి

  • ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు
  • భారతీయుల సహా 13 మంది మృతి
  • కుట్ర కోణం లేదన్న ఖతార్
Qatar

Qatar

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారతీయులు సహా 13 మంది మృతి చెందగా.. 66 మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఖతార్‌లోని అతిపెద్ద సహజ వాయువు (LNG) సముదాయాల్లో ఒకటైన రాస్ లాఫాన్ గ్యాస్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన భారీ పేలుడు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో భారతీయులు, పాకిస్థానీయులు సహా మొత్తం 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 66 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ అధికారికంగా వెల్లడించారు.

×
×
Ad

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన… “నేను ఎప్పుడూ చెప్పకూడదని ఆశించిన ఒక విషాదకరమైన వార్తను ప్రకటించాల్సి వస్తోంది. భారతీయ, పాకిస్థానీ జాతీయత కలిగిన 13 మంది ప్రాణాలు కోల్పోయారు” అని తెలిపారు. అయితే మృతుల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇరాన్ క్షిపణి దాడి కారణంగా ప్లాంట్ కార్యకలాపాలు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన 66 మందికి చికిత్స అందిస్తున్నామని, వారిలో ఎవరి పరిస్థితి కూడా ప్రాణాపాయంగా లేదని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఖతార్ అధికారులు దీనిని ‘సాంకేతిక ప్రమాదం’గా అభివర్ణించారు. బార్జాన్ గ్యాస్ సరఫరా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రమాదం కారణంగా ఖతార్ గ్యాస్ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఖతార్ ఎనర్జీ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలకు గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని మంత్రి సాద్ అల్-కాబీ తెలిపారు. “ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన మాత్రమే. ఇందులో ఎలాంటి విధ్వంసక చర్యలు లేదా శత్రుదాడి కోణం లేదు” అని స్పష్టం చేశారు. పేలుడు ప్లాంట్‌లో ఏ ప్రాంతంలో సంభవించింది? ఎంత మేర నష్టం జరిగింది? అనే విషయాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

బార్జాన్ ప్లాంట్ రోజుకు సుమారు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్‌ల గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఖతార్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ల నిర్వహణకు ఈ గ్యాస్ కీలకంగా ఉపయోగపడుతోంది. గత మార్చిలో కూడా రాస్ లాఫాన్ సముదాయంపై ఇరాన్ క్షిపణి దాడి జరగగా.. ఆ ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి గణనీయమైన నష్టం వాటిల్లింది. తాజాగా మరోసారి జరిగిన పేలుడు ఖతార్ ఇంధన రంగంలో ఆందోళన కలిగిస్తోంది.