Putin Visits Mariupol: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆక్రమిత ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. మారియోపోల్ నగరాన్ని సందర్శించారు. యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఈ నగరాన్ని రష్య ఆక్రమించింది. తాజాగా మొదటిసారిగా పుతిన్ ఈ నగరాన్ని సందర్శించారు. వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలపై రష్యా అకృత్యాలకు పాల్పడిందని ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఈ పర్యటన జరిగింది.
Read Also: Punjab: అస్సాంకు అమృత్‌పాల్ సింగ్ అనుచరులను..భయానక వాతావరణం సృష్టించొద్దన్న సిక్కు సంస్థ
పుతిన్ శనివారం ప్రత్యేక హెలికాప్టర్ లో మారియోపోల్ కు వెళ్లారు. కారులో నగరం అంతటా పర్యటించారు. పలు ప్రాంతాల్లో నగరవాసులతో మాట్లాడి నగర పునర్నిర్మాణ పనులపై వివరించారు. గతంలో ఉక్రెయిన్ లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యా ఆక్రమించింది. ఇది రష్యాలో భాగం అయిన తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా క్రిమియాను సందర్శించిన తర్వాత మారియోపోల్ కు పుతిన్ వెళ్లారు. స్థానిక మాస్కో-నియమించిన గవర్నర్ మిఖాయిల్ రజ్వోజాయేవ్‌తో కలిసి నల్ల సముద్రపు ఓడరేవు నగరం సెవాస్టోపోల్‌ను సందర్శించినట్లు రష్యా మీడియా చూపించింది. పుతిన్ ఎల్లప్పుడు సెవాస్టోపోల్ ప్రజలతో ఉంటారని రజ్వోజాయేవ్ చెప్పారు.
రష్యా గతేడాది ఉక్రెయిన్ లోని మారియోపోల్ ను ముట్టడించి హస్తగతం చేసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ను పుతిన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, రష్యా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ వారెంట్ ఇష్యూ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యదేశాలుగా ఉన్న 120 దేశాల్లో ఏదైనా దేశానికి వెళ్తే పుతిన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం యుద్ధం బుఖ్ ముత్ ప్రాంతంలో కేంద్రీకృతం అయి ఉంది.