Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..

  • వృద్ధాప్యాన్ని జయించేందుకు రష్యా భారీ ప్రాజెక్ట్.
  • $26 బిలియన్‌తో యాంటీ-ఏజింగ్ మిషన్ ప్రారంభం.
  • మినీ పిగ్స్‌లో మానవ అవయవాల పెంపకం లక్ష్యం.
  • 3D బయోప్రింటింగ్‌తో జీవ కణజాల తయారీ.
  • అమరత్వంపై పుతిన్ డ్రీమ్ ప్రాజెక్ట్..
Putin

Putin

Anti-Ageing Plan: మరణాన్ని జయించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. వృద్ధాప్యాన్ని జయించి, మనుషులు ఆయుష్షును పెంచాలనే లక్ష్యంతో ఏకంగా రష్యా 26 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఈ ‘‘యాంటీ-ఏజింగ్’’ ప్రాజెక్టులో భాగంగా మినీ పిగ్స్‌లో మానవ అవయవాల పెంపు, 3D బయో ప్రింటింగ్ ద్వారా అవయవాల తయారీ వంటి సంచలన ప్రయోగాలను రష్యా చేపడుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ఈ ప్రాజెక్టుకు రష్యా చాలా ప్రాధాన్యత ఇస్తోందని నివేదించింది.

జయో ప్రింటింగ్ టెక్నాలజీతో జీవ కణజాలాన్ని 3డీ ప్రింటర్ల ద్వారా తయారు చేయడం, ‘‘జీనో ట్రాన్స్‌ప్లాంటేషన్’’ ద్వారా మినీ పిగ్స్ లో మానవ అవయవాలను పెంచడం వంటి ప్రయోగాలను చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు పుతిన్ కుమార్తె, ఎండోక్రైనాజిస్ట్ మరియా వోరోంట్సోవా, ప్రముఖ ఫిజిక్స్ సైంటిస్ట్ మిఖాయిల్ కోవల్చుక్ నేతృత్వం వహిస్తున్నారు. భవిష్యత్తులో మానవ అవయవాలను రిపేర్లు చేయడం, అవసరమైతే పూర్తిగా మార్పిడి చేయడం సాధ్యమవుతుందని కోవల్చుక్ అభిప్రాయపడ్డారు. రష్యా సైంటిస్టులు ఇప్పటికే బయోప్రింటెడ్ మానవ కార్టిలేజ్ టిష్యూ, ఎలుక థైరాయిడ్ గ్రంధిని తయారు చేసినట్లు సమాచారం. ఈ దశాబ్ధం చివరకు మానవ అవయమాల మార్పిడి సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.

×
×
Ad

ఇదిలా ఉంటే, ఈ ప్రాజెక్టుపై రష్యాలో బయోప్రింటింగ్ పరిశోధనలకు పునాది వేసిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఓస్ట్రోవ్‌స్కీ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం కోరికల స్థాయిలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. 73 ఏళ్ల పుతిన్ పలు సందర్భాల్లో అమరత్వం గురించి చర్చించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో మనుషుల అవయవాల మార్పిడి ద్వారా చావును జయించవచ్చని పుతిన్ అన్నారు.