Indonesia: ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాకు కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో(72) ఎన్నికైనట్లుగా ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది. రక్షణ మంత్రిగా ఉన్న ప్రబోవో ప్రస్తుతం అధ్యక్షుడు కాబోతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడిగా సుబియాంటో ఇండోనేషియా పగ్గాలు చేపట్టనున్నారు. ఇండోనేషియా ఆర్మీలో పనిచేసిన ఆయన రక్షణ మంత్రిగా పనిచేశారు.
సుబియాంటో, అతని వైస్ ప్రెసిడెంట్ 96 మిలియన్ల కన్నా ఎక్కువ ఓట్లు సాధించారు. మొత్తం కౌంట్‌లో దాదాపుగా 58.6 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ మెజారిటీతోనే వీరి విజయం కన్ఫామ్ అయింది. పోటీలో ఉన్న అనీస్ బస్వేదర్ దాదాపు 41 మిలియన్ ఓట్లు, 24.9 శాతం ఓట్లు సాధించారు.
Read Also: Jaishankar: “నెహ్రూ అమెరికా వ్యతిరేకి”.. కాంగ్రెస్ విదేశాంగ విధానంపై జైశంకర్..
ఇండోనేషియా 5వ అధ్యక్ష ఎన్నికలకు ఫిబ్రవరి 14న జరగగా ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. వరసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సుబియాంటో ఈ సారి గెలుపొందారు. రెండుసార్లు ఆయన విడోడో చేతిలో ఓడిపోయి, ఈ సారి గెలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో కొడుకు 36 ఏళ్ల జిబ్రాన్ రాకబుమింగ్ రాకా ఉపాధ్యక్షుడిగా సుబియాంటో ఎంచుకోవడంతో ఆయన గెలుపు మరింత సులభమైంది. అక్టోబర్ నెలలో సుబియాంటో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.