Site icon NTV Telugu

PoK Protests: పాకిస్తాన్ చేజారుతున్న పీఓకే.. ప్రభుత్వంపై జనం తిరుగుబాటు..

Pok Protests

Pok Protests

PoK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జనం తిరగబడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సంవత్సరాల తరబడి పాకిస్తాన్ దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. అయితే, ప్రతీసారి పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. తాజాగా, ఈ సారి కూడా ఈ ఉద్యమాన్ని అణిచేయాలని ప్రయత్నిస్తే, ప్రజలు మరింతగా తిరగబడుతున్నారు. ఆర్మీ, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.

Read Also: Asia Cup Trophy Controversy: లొంగిపోయిన పాక్ మంత్రి.. ఆసియా కప్ ట్రోఫీ ఆ బోర్డుకు అందజేత..

గత రెండు రోజులుగా ప్రజలు, సైన్యం-పోలీసులకు తలవంచేందుకు నిరాకరిస్తున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే అల్లర్లను కవర్ చేయడానికి అక్కడి మీడియాకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో, ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 70 ఏళ్లుగా తమను అణిచివేసి, తమ వనరుల్ని కొల్లగొడుతున్నారని, తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని నిరసనకారులు చెబుతున్నారు.

అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అక్టోబర్ 1న పీఓకేలోని అనేక ప్రధాన పట్టణాలు, జిల్లాల నుండి ముజఫరాబాద్‌కు లాంగ్ మార్చ్ చేపడతామని షౌకత్ నవాజ్ మీర్ ప్రకటించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం అవుతాయని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను హెచ్చరించారు.

Exit mobile version