ప్రధాని మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఇండోనేషియా చేరుకున్న మోడీకి ఘనస్వాగతం లభించింది. ఇక మంగళవారం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇక బుధవారం ఇండోనేషియాలోని వెయ్యేళ్ల నాటి హిందూ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ప్రంబనన్ ఆలయ వైభవాన్ని మోడీ పంచుకున్నారు.
ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ బుధవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రంబనన్ హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. యోగ్యకర్త నగరం సమీపంలో ఉన్న ఈ ఆలయ సముదాయం దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగినదిగా గుర్తింపు పొందింది. ఆలయానికి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి కనిపించిన ప్రంబనన్ ఆలయ వైభవాన్ని మోడీ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ.. ‘‘అద్భుతమైన ప్రంబనన్ ఆలయం’’ అంటూ పేర్కొన్నారు.
ఈ పర్యటన సందర్భంగా భారత్ మద్దతుతో ప్రంబనన్ ఆలయ సముదాయం సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత్-ఇండోనేషియా మధ్య సాంస్కృతిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలక అడుగుగా భావిస్తున్నారు. భారత్ సహకారంతో ఆలయ పునరుద్ధరణ చేపట్టేందుకు ఇరు దేశాలు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) ను కూడా మార్పిడి చేసుకున్నాయి. ఈ ఒప్పందం మంగళవారం ప్రధాని మోడీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశాల అనంతరం కుదిరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని లక్ష్యంగా చేసుకుని భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
ప్రంబనన్ ఆలయ విశిష్టత
జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ దేవాలయ సముదాయం ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ ఆలయ సముదాయం. ఆగ్నేయాసియాలో కంబోడియాలోని అంకోర్‌వాట్ తర్వాత రెండో అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా గుర్తింపు పొందింది. సుమారు 40 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో ఒకప్పుడు దాదాపు 240 ఆలయాలు ఉండేవి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో హిందూ మతారాం రాజవంశానికి చెందిన రాజు రకాయ్ పికతన్ నిర్మాణం ప్రారంభించగా.. ఆయన వారసుడు లోకపాల పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శైవ సంప్రదాయానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆలయ సముదాయంలో హిందూ త్రిమూర్తులైన శివుడు, విష్ణువు, బ్రహ్మకు అంకితమైన మూడు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శివాలయం అత్యంత ఎత్తైనది. సుమారు 47 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ దేవాలయం అద్భుతమైన హిందూ శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తోంది.
రామాయణ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ
ప్రంబనన్ ఆలయ గోడలపై రామాయణంతో పాటు ఇతర హిందూ ఇతిహాసాలకు సంబంధించిన అద్భుత శిల్పాలు చెక్కబడ్డాయి. భారతదేశం, ఆగ్నేయాసియా దేశాల మధ్య శతాబ్దాల క్రితం సముద్ర వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి ఎంత బలంగా ఉండేదో ఈ శిల్పాలు స్పష్టంగా తెలియజేస్తాయి. అయితే 10వ శతాబ్దంలో రాజకీయ పరిణామాలు, సమీపంలోని మెరాపి అగ్నిపర్వతం విస్ఫోటనాల కారణంగా ఈ ఆలయ సముదాయం క్రమంగా నిర్జనంగా మారినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.
#WATCH | Prime Minister Narendra Modi and Indonesian President Prabowo Subianto visit Prambanan Temple in Yogyakarta.
(Video: DD News) pic.twitter.com/qp3acAd2Xk
— ANI (@ANI) July 8, 2026
#WATCH | Indonesia: Prime Minister Narendra Modi and Indonesian President Prabowo Subianto visited Prambanan Temple in Yogyakarta and offered prayers here. pic.twitter.com/2LYI6vDm56
— ANI (@ANI) July 8, 2026
The majestic Prambanan Temple! pic.twitter.com/pRS2S9X5gm
— Narendra Modi (@narendramodi) July 8, 2026

