NTV Telugu Site icon

G20 summit: నేటి నుంచి జీ 20 సమావేశాలు.. ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని మోదీ

G 20 Summit Pm Modi

G 20 Summit Pm Modi

PM Modi to embark for Bali today for G20 Summit: ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రోజున బాలికి బయలుదేరనున్నారు. ఆహారం, ఇంధన భద్రత- ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి వాటిపై వర్కింగ్ సెషన్స్ జరగనున్నాయి. ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ తో పాటు మొత్తం పది దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. యూకే కొత్త ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని మోదీ సమావేశంలో యూకే-ఇండియాల ఫ్రీట్రేడ్ డీల్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also: Earthquake: పంజాబ్ లో భూకంపం.. 4.1 తీవ్రతతో కంపించిన భూమి

కోవిడ్-19, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బనం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై జీ20 దేశాలు చర్చించనున్నాయి. వచ్చే ఏడాది జీ20 సమ్మిట్ ఇండియాలో జరగనుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోదీ లాంఛనప్రాయంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. డిసెంబర్ 1 నుంచి జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుంది. 2023 సెప్టెంబర్ లో జీ 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, అమెరికా, బ్రిటన్ జీ 20 సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచంలోని జీడీపీలో జీ 20 దేశాలు 85 శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, జనాభాలో మూడింట రెండు వంతులు జీ 20 దేశాల్లోనే ఉన్నారు.