రోజు రోజుకు స్త్రీలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన ఏదో విధంగా స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఇది మరింత ఘోరంగా మారింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు తీవ్రంగా మారాయి. దీంతో ఇలాంటి పరిస్థితులకు అడ్డకట్టవేసేందుకు అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించేందుకు అడుగులు వేస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో పంజాబ్ హోం మినిస్టర్ అట్టా తరార్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరుగడం సమాజానికి, ప్రభుత్వానికి కూడా మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పంజాబ్ ప్రావిన్సులో ప్రతి రోజూ నాలుగైదు లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎమర్జెన్సీ విధించేందుకు యోచిస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. పౌర సమాజ, మహిళా హక్కుల సంఘాలు, టీచర్లు తదితరులను ఈ విషయంలో సంప్రదిస్తామన్న అట్టా తరార్.. భద్రత విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడి నిందితులను చాలామందిని ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని ఉపేక్షించేంది లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పరిస్థితులు సర్ధుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తానంటు ఆయన వ్యాఖ్యానించారు.
