Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం

  • ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’
  • ట్రంప్ ఉగ్రవాద వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన పెజెష్కియన్
  • యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
Pezeshkian

Pezeshkian

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను ఉగ్రవాదులు అని పిలిచారు.. కానీ మేము ఉగ్రవాద బాధితులం అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పెజెష్కియన్.. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో మరణించిన విద్యార్థుల ఫొటోలను చూపించి ప్రసంగించారు.

ఇరాన్‌ను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడం తప్పు అని ట్రంప్ చేసిన ప్రకటనను తిప్పికొట్టారు. అణుశక్తి ఇరాన్ హక్కు అని కూడా స్పష్టం చేశారు. ఇరాన్‌లోని పౌరులను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పెజెష్కియన్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే అమెరికా ప్రతినిధి బృందం సభా మందిరం నుంచి నిష్క్రమించింది.

ఇక ప్రసంగంలో అమెరికా-ఇజ్రాయెల్‌లపై తీవ్ర స్థాయిలో మసూద్ పెజెష్కియన్ విమర్శలు గుప్పించారు. ఇరాన్‌కు, ఉగ్రవాదానికి సంబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఇరాన్ స్వయంగా ఉగ్రవాదానికి బాధితురాలిగా మారిందని అన్నారు. ఒక రోజు ముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ను ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్‌గా అభివర్ణిస్తూ.. దానిపై ఆర్థిక బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అణుశక్తి ఇరాన్ హక్కు అని, ఇరాన్ ఆత్మరక్షణ కోసం పోరాడుతోందని పెజెష్కియన్ పేర్కొన్నారు.

‘‘నిన్న ట్రంప్ మమ్మల్ని ఉగ్రవాదులని పిలిచారు. కానీ మేము ఉగ్రవాద బాధితులం. దాడులలో అమాయక ఇరాన్ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మాపై దాడి చేశాయి. వారు మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. కానీ మేము లొంగిపోలేదు. మేము మా సర్వశక్తులతో మమ్మల్ని మేము రక్షించుకున్నాము. ఇరాన్ తనను తాను రక్షించుకుంటోంది.’’ అని అన్నారు. ఇజ్రాయెల్‌పై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ వివిధ నగరాలు, ప్రావిన్సులలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తోందని పేర్కొన్నారు. గాజాను ప్రస్తావిస్తూ అక్కడ 80,000 మందికి పైగా అమాయక పౌరులు చంపబడ్డారని పెజెష్కియన్ ఆరోపించారు.

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిని కూడా పెజెష్కియన్ ప్రస్తావించారు. పిల్లల ఫొటోలను చూపిస్తూ.. ఆ పిల్లలు అమాయకులని, ఎలాంటి నేరం చేయలేదని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఆయుధాలతో జరిగిన దాడుల్లో ఈ పిల్లలు చంపబడ్డారని ఆరోపించారు. ఒప్పందం కుదరకపోతే తీవ్రమైన సైనిక చర్య తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన తర్వాత పెజెష్కియన్ ఈ వ్యాఖ్యలు చేశారు.