నిరసనకారుల ఆందోళనతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్ లేదా లండన్‌కు పారిపోయినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే షేక్ హసీనా రాజీనామాతో నిరసనకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఢాకా వీధుల్లోకి లక్షల మంది ప్రజలు వీధుల్లో వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. లక్షలాది మంది విద్యార్థులు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు.
షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగాలంటూ లక్షలాది మంది నిరసనకారులు ఢాకాలో ఆందోళనకు దిగారు. సోమవారం ఢాకా వీధుల్లో లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రధాని తలవంచక తప్పలేదు. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి పరారయ్యారు. దీంతో ఆందోళనకారులు, ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. తాత్కాలికంగా ఆర్మీ ప్రభుత్వ బాధ్యతలు తీసుకుంది.
ఇదిలా ఉంటే గత నెలలో కోటా ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నిరసనల్లో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. పట్టువీడకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఆదివారం అది మరింత తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 100 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయాలు పాలయ్యారు. ఈ ప్రభావంతో హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు హోరెత్తించారు. దీంతో సోమవారం షేక్ హసీనా రాజీనామా చేసి పరారయ్యారు.