Paraguay Crisis: దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో భారీ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దేశంలో తలెత్తిన తీవ్ర బ్యాంకింగ్ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు శాంటియాగో పెనా (Santiago Pena) తన పదవిని కోల్పోయారు. పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా ఆయనను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా (Pedro Alliana) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
పరాగ్వేలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం చివరకు అధ్యక్షుడి పదవీచ్యుతికి దారితీసింది. దేశ పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్లో శాంటియాగో పెనాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్ సంక్షోభానికి సంబంధించి తీవ్ర నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. మీడియా కథనాల ప్రకారం, శుక్రవారం జరిగిన సెనేట్ ఓటింగ్లో పెనాను పదవి నుంచి తొలగించేందుకు హాజరైన 44 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు. దీంతో అభిశంసన ప్రక్రియ పూర్తయి పెనా అధ్యక్ష పదవిని కోల్పోయారు. అంతకుముందు గురువారం ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, ఎంపీలు ఆ ప్రతిపాదనను అంగీకరించకుండా అభిశంసన ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించారు.
కొత్త అధ్యక్షుడిగా పెడ్రో అలియానా
శాంటియాగో పెనా పదవి నుంచి తొలగించిన తర్వాత ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఆగస్టు 2028 వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆకస్మిక రాజకీయ మార్పుతో పరాగ్వేలో కొత్త ప్రభుత్వం ఏర్పడగా, దేశ భవిష్యత్తుపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
బ్యాంకింగ్ సంక్షోభంతో మొదలైన రాజకీయ సంక్షోభం
పరాగ్వేలో ఈ రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం Ueno బ్యాంక్ మూసివేత. ఈ బ్యాంక్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, చెల్లింపులు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో దేశ కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకుని ఆర్థిక సంస్థను తన నియంత్రణలోకి తీసుకుంది. బ్యాంక్ మూసివేత కారణంగా లక్షలాది మంది ఖాతాదారులు తమ డిపాజిట్ చేసిన డబ్బును పొందడంలో, బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ బ్యాంకుతో అధ్యక్షుడు శాంటియాగో పెనాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఆయన రాజకీయ ప్రభావంతో బ్యాంకుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయోజనాలు కల్పించారని, నియంత్రణ సంస్థలు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించాయని ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను పెనా ఖండించారు. ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
పెనాపై క్రిమినల్ విచారణ కూడా ప్రారంభం
బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో పరాగ్వే అటార్నీ జనరల్ కార్యాలయం అధ్యక్షుడు పెనా, పలువురు మాజీ అధికారులపై మూడు వేర్వేరు క్రిమినల్ కేసుల విచారణ ప్రారంభించింది. విశ్వాస ఉల్లంఘన, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన తర్వాత మాజీ అధ్యక్షుడిగా ఆయనకు లభించే చట్టపరమైన రక్షణ కూడా ముగిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ అధికారులు ఆయనను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించినట్లు కథనాలు వెల్లడించాయి.
ఎవరీ శాంటియాగో పెనా?
44 ఏళ్ల శాంటియాగో పెనా ఆగస్టు 2023లో పరాగ్వే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని మితవాద భావజాలం కలిగిన కొలరాడో పార్టీకి చెందిన నాయకుడు. రాజకీయాల్లోకి రాకముందు ఆర్థికవేత్తగా పనిచేశారు. గతంలో పరాగ్వే ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే లాటిన్ అమెరికా నాయకుల్లో పెనా కూడా ఒకరిగా గుర్తింపు పొందారు. పరాగ్వేలో చోటుచేసుకున్న ఈ అనూహ్య రాజకీయ మార్పుపై అమెరికా స్పందించింది. దేశంలో నాయకత్వ మార్పు జరిగినప్పటికీ పరాగ్వేతో తమ సంబంధాలను కొనసాగిస్తామని అమెరికా ప్రకటించినట్లు సమాచారం.

