NTV Telugu Site icon

Pakistan: పాక్ రాజకీయం సమస్తం నెత్తుటి చరిత్రే.. తిరుగుబాట్లు, హత్యలే

Pakistan History

Pakistan History

Pakistan’s history of coups and assassinations: భారతదేశం కన్నా ఒక రోజే ముందుగా స్వాతంత్య్రం పొందింది దాయాది దేశం పాకిస్తాన్. భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం సైన్యం తర్వాతే ప్రజాస్వామ్యం అన్న రీతిలో తయారైంది. పేరుకు పైకి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కనిపిస్తున్నా.. వెనకనుండి మొత్తం నడిపించేది పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మాత్రమే. పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రధాని కూడా తన 5 ఏళ్ల పరిపాలను పూర్తి చేసుకోలేదు. ప్రధాని నచ్చకపోతే దించడమే.. లేకపోతే సైన్యమే అధికారాన్ని చేజిక్కించుకోడమో చేస్తోంది. ప్రజాస్వామ్యం లేకపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. కేవలం భారత వ్యతిరేక వైఖరిని, తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే అక్కడి నాయకులు, సైన్యం పనిగా పెట్టుకుంది.

ఇమ్రాన్ ఖాన్ హత్యాయత్నం: తాజాగా గురువారం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. దీని వెనక సైన్యమే ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో ఇమ్రాన్ ఖాన్ సైన్యం తీరును విమర్శించారు. పలు సందర్భాల్లో భారత సైన్యంతో పోలుస్తూ పాక్ సైన్యాన్ని ఏకి పారేశారు. పాకిస్తాన్ లో ఇదే మొదటి సంఘటన కాదు.. అలాగని చివరి సంఘటన కూడా ఇదే కాదు. పాక్ చరిత్రలోనే హత్యలు, తిరుగుబాట్లు సాధారణం.

బెనజీర్ భుట్టో హత్య: 2007 ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న బెనజీర్ భుట్టో పై దాడి చేసి హతమార్చారు. రావల్పిండిలో ఈ ఘటన జరిగింది. రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన జెనజీర్ భుట్టో.. ఆ ఏడాది జరుగబోయే ఎన్నికల్లో గెలుస్తుందని పాక్ ప్రజలు భావించారు. ఈ ఘటనకు కొన్ని నెలల ముందు కరాచీలో జరిగిన ఆత్మాహుతి దాడి నుంచి తప్పించుకున్న భుట్టో చివరకు రావల్పిండి దాడిలో చనిపోయింది. ఈ దాడిలో 139 మంది మరణించారు.

Read Also: Imran Khan attack: ఇమ్రాన్ ఖాన్ హత్యాయత్నం వెనక ఉన్నది వీరే..

పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు: పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటు చేసి 1999లో ప్రజాప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ తిరుగుబాటుకు పర్వేజ్ ముషారఫ్ నాయకత్వం వహించాడు. 2001లో అధ్యక్షుడిగా, దేశాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. 2008లోొ పర్వేజ్ ముషారఫ్ రాజీనామా చేసిన తర్వాత 2008లో బెనజీర్ బుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.

జియా ఉల్ హక్ మరణం: 1988లో మిలిటరీ పాలకుడు అయిన మహ్మద్ జియా ఉల్ హక్ ప్రయాణిస్తున్న హెర్క్యూలస్ సీ-130 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆయన ప్రయాణిస్తున్నవిమానం కూలింది. ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందని భావిస్తుంటారు.

జుల్ఫికర్ అలీ బుట్టో ఉరి: ప్రధానమంత్రిగా ఉన్న బెనజీర్ భుట్టో తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను 1977లో పదవిని నుంచి దించింది సైన్యం. జియా ఉల్ హక్ సైన్యాధ్యక్షుడిగా, పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. తన హత్యకు జుల్ఫీకర్ అలీ భుట్టో కుట్ర పన్నాడనే కారణంతో జుల్ఫీకర్ అలీ భుట్టోను 1979లో ఉరి తీశారు. అధికారాన్ని చేపట్టిన జియా ఉల్ హక్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి.. రాజకీయ పార్టీలను నిషేధించాడు.

Read Also: Twitter: చిక్కుల్లో ఎలాన్ మస్క్.. కోర్టులో పిటిషన్.. కారణం ఇదే..

యాహ్యా ఖాన్: అంతకుముందు సైనిక పాలకుడిగా ఉన్న యాహ్యా ఖాన్ సమయంలో ఎన్నికలు జరిగి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానిగా 1973లో ఎన్నికయ్యారు.

అయూబ్ ఖాన్ తిరుగుబాటు: స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా పాకిస్తాన్ లో 1958లో మొదటి సైనిక తిరుగుబాటు జరిగింది. గవర్నర్ జనరల్ గా ఉన్న ఇస్కందర్ మీర్జా నుంచి సైనిక జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మార్షల్ లా విధించి అయూబ్ ఖాన్ అధ్యక్ష పదవిని చేపట్టాడు.

లియాఖత్ అలీఖాన్ హత్య: 1947 భారత విభజన తర్వాత పాకిస్తాన్ మొదటి ప్రధానిగా ఉన్న లియాఖత్ అలీ ఖాన్ రావల్పిండిలో జరిగిన ఓ ర్యాలీలో 1951లో కాల్చి చంపబడ్డాడు.