Site icon NTV Telugu

Pakistan: సర్వ శక్తివంతుడిగా ‘‘ఆసిమ్ మునీర్’’.. ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా పాక్ సైన్యం తర్వాతే..

Asim Munir

Asim Munir

Pakistan: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం దాదాపుగా కనుమరుగైనట్లే. పాకిస్తాన్‌లో ఇన్నాళ్లు ప్రజాస్వామ్యం ఉన్నట్లు బయటకు కనిపించినప్పటికీ, సైన్యం తెర వెనుక నుంచి ఆడించేది. అయితే, తాజాగా పాకిస్తాన్ 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇప్పుడు సైన్యమే, పౌర ప్రభుత్వం కన్నా శక్తివంతమైంది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఈ బిల్లుకు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ గురువారం ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. ఈ బిల్లు చట్టంగా మారడంతో, ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు కూడా అధిపతిగా మారుతారు. దీంతో పాటే, ఈ బిల్లు ద్వారా సుప్రీంకోర్టు అధికారాలకు కోత పడింది.

త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్:

ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలకు కూడా అధిపతిగా ఉంటారు. మొత్తం పాక్ సైన్యమే ఆయన కిందకు వస్తుంది. నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో అణు, ఇతర స్టాటజిక్ ఆస్తుల పర్యవేక్షణ ఉంటుంది. దీనికి కమాండర్‌ను ఆర్మీ చీఫ్ సిఫారసు మేరకు ప్రధాని నియమిస్తారు. ఆయన కూడా సైన్యం నుంచే రావాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అణు అధికారం, ఇతర సైనిక నిర్ణయాలు పౌర ప్రభుత్వం చేతిలో ఉండేవి. అధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడి హోదా కలిగి ఉండేవారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఆ అధికారాలు అన్ని ఆసిమ్ మునీర్‌కు బదిలీ అవుతాయి.

చట్టాలకు అతీతుడు:

కొత్త చట్టం ద్వారా ఆసిమ్ మునీర్ చట్టానికి అతీతుడిగా మారాడు. ‘‘ఫైవ్ స్టార్’’ జనరల్స్ ఇప్పుడు ఎలాంటి చట్టపరమైన చర్యలకైనా అతీతులుగా ఉంటారు. అంటే, ఏ కోర్టు కూడా ఆయనను విచారించి శిక్షించలేవు. పాకిస్తాన్ చరిత్రలో జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత రెండవ ఫైవ్-స్టార్ ర్యాంక్ అధికారి అసిమ్ మునీర్. ఇదే కాకుండా ఫైవ్ స్టార్ జనరల్స్ తమ ర్యాంక్, అధికారాలను నిలుపుకుంటారు, జీవితాంతం యూనిఫామ్‌లోనే ఉంటారు. పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ద్వారా మాత్రమే వారిని పదవి నుంచి తొలగించవచ్చు.

ఇవన్నీ కూడా ఆయనను ప్రభుత్వాని కన్నా అత్యున్నతుడిని చేశాయి. పాక్ అధ్యక్షుడు, గవర్నర్లు అధికారంలో ఉన్నంత వరకే చట్టాల నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది. ఒక్కసారి పదవి పోతే వీరికి ఆ పరిస్థితి ఉండదు. పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. కానీ, ఆసిమ్ మునీర్‌, ఆయన తర్వాత ఈ స్థానంలో ఉన్న వారిని కూడా సాధారణ మెజారిటీలో తొలగించలేదు.

పాక్ సుప్రీంకోర్టు అధికారాలకు కోత:

కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ (FCC) సృష్టించబడుతోంది, దాని ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కోర్టు రాజ్యాంగాన్ని వివరించడం, వివిధ ప్రభుత్వాల మధ్య, సమాఖ్య మరియు ప్రాంతీయ లేదా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను విచారిస్తుంది. అందువల్ల, సుప్రీంకోర్టు ఇప్పుడు సివిల్, క్రిమినల్ కేసులకు అప్పీల్ చేసే చివరి కోర్టు మాత్రమే. ఇకపై అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే అధికారాన్ని కూడా FCC స్వాధీనం చేసుకుంది. ఇంతకముందు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసేటప్పుడు వారి సమ్మతిని కోరే వారు. ఇకపై అలా ఉండదు. వారు బదిలీకి నిరాకరిస్తే, పదవీవిరమణ చేయమడి అడుగుతారు.

Exit mobile version