Petrol Prices: ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడిచమురు మార్కెట్‌పై పడుతున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో పొరుగు దేశమైన పాకిస్థాన్ ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఆ దేశ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను రూ.6.80 మేర తగ్గించింది. అయితే, పాక్‌లో ధరలు తగ్గుతుంటే.. భారత్‌లో మాత్రం ఇంధన ధరలు స్వల్పంగా పెరగడం గమనార్హం.
పాకిస్థాన్‌లో కొత్త ధరలు ఇవే..
పాక్ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ తగ్గింపు తర్వాత అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.403.78 వద్దకు చేరగా, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరు రూ.402.78 కి దిగొచ్చింది. తగ్గించిన ఈ కొత్త ధరలు మే 23 (శనివారం) నుండి అమల్లోకి వచ్చాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఇలా వరుసగా ఇంధన ధరలను తగ్గించడం ఇది రెండో వారం. అంతకుముందు వారంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 చొప్పున తగ్గించారు. సాధారణంగా పెట్రోల్‌ను ద్విచక్ర వాహనాలు, రిక్షాలు, చిన్న ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువగా వాడటం వల్ల ఈ తగ్గింపు అక్కడి మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌కు కాస్త ఊరటనివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రవాణా రంగం, భారీ జనరేటర్లలో వాడే హై – స్పీడ్ డీజిల్ ధర తగ్గడం కూడా మార్కెట్‌కు సానుకూల అంశమే అని చెబుతున్నారు.
ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇరాన్ వేదికగా అమెరికా – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మొదలైన తర్వాత, పాక్ ప్రభుత్వం తొలుత మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి లీటరుకు ఏకంగా 55 రూపాయలు పెంచింది. ఆ తర్వాత ఏప్రిల్ 2న పెట్రోల్‌పై 43 శాతం, డీజిల్‌పై 55 శాతం మేర చారిత్రాత్మక పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటి నుంచి పాక్ సర్కార్ ప్రతి శుక్రవారం ఇంధన ధరలను సమీక్షిస్తూ వస్తోంది.
భారత్‌లో మాత్రం పెరుగుదల.. సీఎన్‌జీ కూడా అప్!
మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో భారతదేశంలో ఇంధన ధరలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అయితే పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్‌లో ఈ భారం చాలా తక్కువగా ఉంది. దేశంలో మూడు దఫాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు సుమారుగా రూ.5 మేర పెరిగాయి. శనివారం కూడా చమురు కంపెనీలు ధరలను సవరించాయి. పెట్రోల్ ధరపై 87 పైసలు, డీజిల్ ధరపై 91 పైసలు పెరిగింది. వీటితో పాటు వాహనదారులకు షాక్ ఇస్తూ సీఎన్‌జీ (CNG) ధరలను కూడా రూ.1 మేర పెంచారు.
