Site icon NTV Telugu

Smoking Violation: విమానంలో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డ పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్.. దింపేసిన సిబ్బంది..

Untitled Design (12)

Untitled Design (12)

FIH ప్రో లీగ్ టోర్నమెంట్‌కు సీనియర్ పాకిస్తాన్ హాకీ జట్టుతో పాటు మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్‌లో వివాదంలో చిక్కుకున్నారు. అర్జెంటీనా నుంచి పాకిస్తాన్‌కు తిరిగి వస్తున్న క్రమంలో విమానం రియో డి జనీరో విమానాశ్రయంలో ఇంధనం నింపేందుకు ఆగిన సమయంలో, విమానంలోనే ధూమపానం చేసినందుకు ఆయనను విమాన సిబ్బంది దింపేశారు.

భద్రతా నిబంధనల ఉల్లంఘనగా భావించిన విమాన సిబ్బంది అంజుమ్ సయీద్‌తో పాటు మరో పాకిస్తాన్ ఆటగాడిని దుబాయ్‌కు వెళ్లే తదుపరి విమానంలో ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో వారు బ్రెజిల్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. 1992 ఒలింపిక్స్ సెమీఫైనల్‌లో పాల్గొన్న అనుభవజ్ఞుడైన అంజుమ్ సయీద్, 1994 ప్రపంచకప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టులో డిఫెండర్‌, మిడ్‌ఫీల్డర్‌గా కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని ఈసారి జట్టు మేనేజర్‌గా నియమించడం గమనార్హం.

అయితే ఈ ఘటన అనంతరం ఆయన స్వదేశానికి చేరుకుని, జట్టుతో కలిసి రాలేకపోవడానికి దుబాయ్‌లోని కొంతమంది సిబ్బంది ప్రవర్తనే కారణమని ఆరోపించారు. ఈ సంఘటన పాకిస్తాన్ క్రీడా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని భావించిన పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు అధికారులు స్పందించి, ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (PHF)ను కోరారు.

విమానం ఇంధనం నింపుతున్న సమయంలో ధూమపానం అంశంపై ప్రశ్నించగా అంజుమ్ సయీద్‌తో పాటు మరో ఆటగాడు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ జట్టు తమ తొలి FIH ప్రో లీగ్ ప్రదర్శనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఇలాంటి వివాదాలు తలెత్తడం పాకిస్తాన్ హాకీపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Exit mobile version