Site icon NTV Telugu

Pakistan: “నేషనల్ ఎమర్జెన్సీ” ప్రకటించిన పాక్

Pakistan Floods

Pakistan Floods

Pakistan Declares National Emergency: అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.. మరోవైపు శ్రీలంక పరిస్థితి కళ్లముందు కనిపిస్తోంది దాయాది దేశానికి. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల మధ్య ఆ దేశాన్ని వరదలు, భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. వరదల వల్ల ఏకంగా 937 మందికి పైగా మరణించారు. 3 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో భారీ వరదల కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘జాతీయ అత్యవసర పరిస్థితి’’ని ప్రకటించింది.

జూన్ నెలలో ప్రారంభమైన వర్షాల వల్ల పాకిస్తాన్ లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్ లో ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే 306 మంది ప్రాణాలు కోల్పోగా.. బలూచిస్తాన్ లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్ లో 165 మంది, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 185 మంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 37 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్ లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: High alert in Old City: పాతబస్తీలో మొదలైన ప్రార్థనలు.. అడుగడుగునా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌

పాకిస్తాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం ఆగస్టులో పాకిస్తాన్ లో 166.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సగటున 44 మిల్లీమీటర్లు కురవాల్సిన వర్షపాతం ఏకంగా 241 శాతం పెరిగిందని.. అత్యధికంగా సింధ్, బలూచిస్తాన్ లలో 784, 496 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వెల్లడించింది. వర్షాలు అసాధారణంగా కురవడంతో దేశవ్యాప్తంగా నదులు పొంగిపొర్లాయి. చాలా ఊళ్లు నీటిలో మునిగిపోయాయి. పాకిస్తాన్ దక్షిణ భాగం వరదల వల్ల తీవ్రంగా దెబ్బతింది. సింధ్ ప్రావిన్స్ లోని 23 జిల్లాలు వరద విపత్తు బారినపడ్డాయి. భారీ వర్షాల పాకిస్తాన్ లోని రోడ్డు, విద్యుత్, టెలిఫోన్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా, రాజకీయ అస్థిరతతో ఉన్న పాకిస్తాన్ ను ఈ భారీ వరదలు తీవ్రంగా దెబ్బతీశాయి.

Exit mobile version