Pak Police Recovers Weapons, Petrol Bombs From Imran Khan’s House: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఆయన్న అరెస్ట్ చేసేందుకు రెండు రోజల క్రితం ప్రయత్నించగా.. ఆయన మద్దతుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇదిలా ఉంటే శనివారం అవినీతి కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ ఖాన్ వెళ్లారు. దీంతో లాహోర్ లోని జమాన్ పార్క్ ఏరియాలో ఉన్న ఆయన ఇంటిపై 10,000 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్ లో ఇమ్రాన్ ఖాన్ ఇంటి నుంచి భారీగా ఆయుధాలు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పలువురు పీటీఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ నివాసం ముందు ఉన్న బారికేడ్లను తొలగించారు.
Read Also: Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కు రంగం సిద్ధం..?
ఈ వారం ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు, పాక్ రేంజర్లు ప్రయత్నించగా ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. లాహోర్ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ అరెస్టును నిలిపివేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఇమ్రాన్ ఖాన్ నివాసంపై భారీ ఆపరేషన్ నిర్వహిచారు. 61 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో పాటు ఆయన నివాసం నుంచి కలాష్నికోవ్ తో పాటు 20 గన్స్, పెట్రోల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ దాడులపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టం మీకు అధికారం ఇచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మళ్లీ నవాజ్ షరీఫ్ ను తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ఆయన అన్నారు. ఇమ్రాన్ భార్య బుష్రా ఖాన్ ఉన్న ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. ప్రభుత్వం తనను అరెస్ట్ చేసి చంపాలని చూస్తోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మద్దతు ఉన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది.
