Site icon NTV Telugu

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ మాజీ ప్రధానిపై ఉగ్రవాద కేసు

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై తాజాగా పోలీసులు తీవ్రవాద కేసు నమోదు చేశారు. అవినీతి కేసులో కోర్టు విచారణకు ముందు ఇస్లామాబాద్‌లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసానికి పాల్పడడం, భద్రతా సిబ్బందిపై దాడి చేయడం, శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మరికొంత మందిపై పాకిస్తాన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

Read Also: Akhil Akkineni: మరోసారి ప్రేమలో పడ్డ అఖిల్.. అంతమాట అనేశాడేంటి..?

తోషాఖానా కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లారు. ఈ సమయంలో ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఘర్షణ చెలరేగింది. పీటీఐ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంట్లో 25 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మొత్తంగా 17 మంది పీటీఐ నేతలపై ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ధ్వంసం చేయడం, రాళ్లు రువ్వడం వంటి కేసుల్లో వీరందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం కావడంతో పాటు 7 బైకులు దగ్ధం అయ్యాయి.

శనివారం విచారణకు ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్లగానే, 10,000 మంది పోలీసులు లాహోర్ జమాన్ పార్క్ ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఇమ్రాన్ ఇంటి నుంచి తుపాకులు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు, పాక్ రేంజర్లు విఫలయత్నం చేశారు. భారీగా ఇమ్రాన్ మద్దతుదారులు పోలీసులను ప్రతిఘటించారు. దీంతో జమాన్ పార్క్ రణరంగంగా మారింది. చివరకు లాహోర్ కోర్టు ఆదేశాలతో అరెస్టును వాయిదావేయాల్సి వచ్చింది. దేశప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు వచ్చిన బహుమతులను అమ్ముకున్నాడన్నదే ‘తోషాఖానా’ కేసు. ఈ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.

Exit mobile version