Site icon NTV Telugu

London: నేపాల్ తర్వాత, లండన్‌లో భారీ నిరసనలు.. లక్షల్లో పాల్గొన్న జనం..

London

London

London: నేపాల్ హింసాత్మక ఘటనల తర్వాత పలు దేశాల్లో అనేక విషయాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా యూకే రాజధాని లండన్‌లో భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూకే చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. వలసకు వ్యతిరేకంగా టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా నిరసనకారులు మార్చ్ చేశారు. ఈ ప్రదర్శనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పలువురు పోలీస్ అధికారులపై దాడులు చేసినట్లుగా నివేదికలు వస్తున్నాయి. ‘‘యునైట్ ది కింగ్‌డమ్’’ మార్చ్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఏకంగా 1,10,000 మంది పాల్గొన్నట్లు పోలీసులు నివేదించారు.

Read Also: Off The Record: బడా బీజేపీ నేతల జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకం ఎందుకు ఆగిపోయింది?

రాబిన్సన్ ర్యాలీకి వ్యతిరేకంగా ‘‘ స్టాండ్ అప్ టూ రేసిజం’’ పేరుతో మరో నిరసన కార్యక్రమం జరిగింది. దీనికి 5000 మంది హాజరయ్యారు. ఒక్కసారిగా లక్షల్లో జనాలు వీధుల్లోకి రావడంతో ఒక్కసారిగా లండన్ వీధులు జనసంద్రంగా మారాయి. వలసదారులు నివసించే హోటళ్ల వెలుపల నిరసనలు జరిగాయి. కొందరు అమెరికా, ఇజ్రాయిల్ జెండాలను ప్రదర్శించారు. కొంత మంతి నిరసనకారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’’ టోపీలను ధరించారు. ప్రధాని కీర్ స్టార్మర్‌ను విమర్శించేలా నినాదాలు చేశారు. వలసదారుల్ని వారి దేశాలకు పంపాలని నినదించారు. నిరసన ప్రదర్శన కారణంగా పోలీసులు శనివారం లండన్ అంతటా 1600 మందికి పైగా అధికారుల్ని మోహరించారు.

టామీ రాబిన్సన్ తరుచుగా వలసల్ని వ్యతిరేకిస్తూ, ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. ఈయన అసలు పేరు స్టీఫెన్ క్రిస్టోఫర్ యాక్ల్సీ లెన్నాన్. 2009లో రాబిన్సన్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్(ఈడీఎల్) అనే సంస్థను స్థాపించాడు. ఇది ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేసే సంస్థగా పేరుంది. దీంతో రాబిన్సన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే, దేశంలో జాతీయవాదానికి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచి, లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. పలు సందర్బాల్లో జైలుకు వెళ్లొచ్చాడు. అయితే, యూకేలో వలస వ్యతిరేక రాజకీయ పార్టీ, ఇతర ఎన్నికల్లో ముందంజలో ఉన్న రిఫార్మ్ యూకే మాత్రం రాబిన్సన్ ఉద్యమానికి దూరంగా ఉంది. నేరారోపణల కారణంగా ఆయనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version